Heavy rains in nellore district: నెల్లూరు జిల్లా ఆత్మకూరు జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, పెన్నా వరదతో ఆత్మకూరు చెరువును తలపిస్తోంది. ఇళ్లు నీటమునగడంతో.. ప్రజలు తీవ్ర అపస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతలలో ఉన్న గిరిజనుల పరిస్దితి మరి దారుణంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎటు చూసిన నీరే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చేజేర్ల, అనంతసాగరం, ఏఎస్పేట మండలాల్లో వాగులు పొంగుతుండటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలకు గూడూరు ఆర్టీసీ బస్టాండ్ చెరువులా మారింది. చేజర్ల మండలం నాగుల వెల్లటూరు, పాతపాడు చెరువులకు గండ్లు పడ్డాయి. అప్రమత్తమైన అధికారులు మరమ్మతులు చేపట్టారు.
నగరంలోని కొండాయపాలెం గేట్, కె.వి.ఆర్ పెట్రోల్ బంక్ సెంటర్, పొదలకూరు రోడ్డు, వీఆర్సీ సెంటర్, గాంధీ బొమ్మ, పొగతోట, సుబేదారుపేట ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు జోరుగా ప్రవహిస్తోంది. అసలే అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
సోమశిలకు కొనసాగుతున్న వరద ప్రవాహం
భారీ వర్షాలతో సోమశిల జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 96 వేల క్యూసెక్కులు ఉండగా..ఔట్ ఫ్లో 1,16 క్యూసెక్కులు ఉంది. సోమశిల జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 68.37 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి భారీ వరదల దృష్ట్యా పెన్నా పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నెల్లూరు జిల్లాలో కలువాయి చెరువు అలుగు పోస్తుంది. పంట పొలాల్లో వరద నీరు ప్రవాహిస్తోంది. వరి నారుమళ్లు, సంపంగి పూల తోటలు నీట మునిగాయి.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది..