నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పది రోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని వానలు వదలకపోవటంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. కోవూరు, కావలి, గూడూరు, నాయుడుపేట, వెంకటగిరిలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో వరినాళ్లు నీటమునిగాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండలను తలపిస్తుండటంతో జలవనరులశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బలహీనంగా ఉన్న చెరువు కట్టలకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. నగర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పనులకు తీవ్ర ఆటంకం ఏర్పాడుతుంది.
జిల్లాలో గ్రామీణ, పట్టణ రహదారులు దెబ్బతిన్నాయి. నెల్లూరు-అల్లీపురం రహదారి చెరువును తలపిస్తోంది. గూడూరు - రాజంపేట మార్గంలో అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో చిత్తూరు, కడప, జిల్లాకు వెళ్లే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులన్ని గుంతలు పడి వర్షపు నీటితో నిండిపోవటం.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం తలెత్తుతోంది.