MANDOUS EFFECT IN NELLORE : మాండౌస్ తుఫాన్ ప్రభావంతో గత రాత్రి నుంచి నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వానల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కనకమహాల్ సెంటర్ , కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్, కరెంట్ ఆఫీస్ సెంటర్, పొదలకూరు రోడ్డు, పద్మావతి సెంటర్, డైకాస్ రోడ్లో నీరు వరద భారీగా చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో వరి నాట్లు, నారుమడలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈదురుగాలులతో కూడిన వర్షాలు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి తోడు చల్లటి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బైటకు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని సంగంలో10సెం.మీ, కలువాయి 9 సెం.మీ, ఏఎస్ పేట 8 సెం.మీ, ఆత్మకూరు 7 సెం.మీ, అనంతసాగరంలో 6 సెం.మీ వర్షపాతం నమోదు కాగా.. మిగతా చోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది.