RAINS IN NELLORE AND KADAPA : అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నగరంతో పాటు.. కావలి, ఆత్మకూరు, కందుకూరులో వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్మకూరు బస్టాండ్ లోని అండర్ పాస్ వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కేవీఆర్ పెట్రోల్ బంకు, అయ్యప్పస్వామి దేవాలయ ప్రాంతం, పొదలకూరు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి.
మురుగునీటితో ప్రజల ఇబ్బందులు : జిల్లాలోని ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవటంతో మురుగు నీరు పొంగి ప్రవహిస్తూ.. దుర్వాసనను వెదజల్లుతోంది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఆత్మకూరు, ఏఎస్పేట, సంగం మండలాల్లో భారీ వర్షాలు.. మర్రిపాడు, అనంతసాగరం, చేజర్ల మండలాల్లో ఓ మోస్తారుగా వానలు పడుతోన్నాయి. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.