ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో మాండౌస్​ తుపాన్​ బీభత్సం.. భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం - కాలంగి రిజర్వాయర్‌

RAINS IN AP: మాండౌస్‌ తుపాను చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను ప్రభావంతో మూడు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

RAINS IN AP
RAINS IN AP

By

Published : Dec 10, 2022, 11:48 AM IST

Updated : Dec 10, 2022, 12:15 PM IST

RAINS IN AP DUE TO MANDOUS : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను మాండౌస్‌.. తమిళనాడులోని మహాబలిపురం వద్ద తీరాన్ని దాటింది. అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో.. పుదుచ్చేరి-చెన్నై మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటిందని.. భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఇది తీరం దాటాక తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని IMD తెలిపింది. క్రమంగా మరింత బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సువర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద : మాండౌస్‌ తుపాను ప్రభావంతో.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సువర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుండటంతో.. ప్రధాన రహదారిలోని కాజ్‌వేలపైకి నీరు పొంగి ప్రవహిస్తోంది. ఏర్పేడు-సదాశివపురం ప్రధాన రహదారిపై మోదుగులపాలెం సమీపంలో సువర్ణముఖి నది కాజ్‌వే, శ్రీకాళహస్తి-పాపానాయుడుపేట-గుడిమల్లం ప్రధాన రహదారులపై కాజ్‌వేలపై వరద పొంగి ప్రవహిస్తుండటంతో.. రాకపోకలు స్తంభించాయి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షం ప్రభావంతో.. శ్రీకాళహస్తీశ్వరాలయం బోసిపోయింది.

కాలంగి రిజర్వాయర్‌ గేట్ల ఎత్తివేత: తుపాను ప్రభావంతో KVB పురం మండలం కాలంగి రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 10 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా దిగువన ఉన్న పూడికేపురం-M.A.రాజుల కండ్రిగ మధ్య కాజ్‌వే కొట్టుకుపోయింది. శ్రీకాళహస్తి-పిచ్చాటూరు ప్రధాన రహదారిపై వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో.. రాకపోకలను అధికారులు నియంత్రించారు.

పరవళ్లు తొక్కుతున్న కైవల్య నది: తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో మాండౌస్‌ తుపాను ప్రభావం వల్ల రెండ్రోజులు కురుస్తున్న వర్షాల కారణంగా.. కైవల్య నది పరవళ్లు తొక్కుతోంది. ఫలితంగా డక్కిలి మండలం నడింపల్లి, బాలాయపల్లి మండలం కడగుంట, నిండలి గ్రామాల వద్ద ఉన్న వంతెనలపైకి వరద ప్రవహిస్తోంది. రెండు గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లింగసముద్రం గ్రామం సమీపంలో రోడ్డపై చెట్లు విరిగి పడటంతో... అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న రావూరు, సైదాపురం, కలవాయి మండలాల్లోనూ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రావూరు మండలం పెంచలకోన ఆలయాన్ని ఆనుకుని ఉన్న కణ్వ నది పరవళ్లు తొక్కుతోంది.

నెల్లూరులో ఎడతెరిపి లేని వర్షం: మాండౌస్ తుపాను ప్రభావంతో.. నెల్లూరు జిల్లాలో నిన్న రాత్రి నుంచీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కనకమహల్ సెంటర్‌, KVR పెట్రోల్ బంక్‌ సెంటర్‌, కరెంట్ ఆఫీస్‌ సెంటర్‌, పొదలకూరు రోడ్డు, పద్మావతి సెంటర్‌, డైకాస్‌ రోడ్డులో నీరు భారీగా చేరడంతో.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి నాట్లు, నారుమడులు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జలాశయానికి భారీ వరద ప్రవాహాం వస్తోంది. ముందస్తు జాగ్రత్తగా జలాశయం నుంచి పెన్నానదికి నీటిని విడుదల చేశారు. నదీ పరివాహాక ప్రాంతాలైన అనంతసాగరం, చేజర్ల, కలువాయి, ఆత్మకూరు, సంగం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

రైల్వేకోడూరు నియోజకవర్గవ్యాప్తంగా వానలు: అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గవ్యాప్తంగా... శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. నియోజకవర్గంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు వర్షపు నీటితో నిండిపోయాయి. మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు.. దెబ్బతింటాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తిరుపతిలో స్తంభించిన జనజీవనం: తుపాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని కొత్త కండ్రికలో ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరింది. లింగం నాయుడు పల్లి - శ్రీకాళహస్తి ప్రధాన రహదారిపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో...రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

తుపాన్‍ ప్రభావంతో కురిసిన భారీవర్షాలు తిరుపతి నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. రాత్రంతా అతివేగంగా వీచిన గాలులు, భారీ వర్షంతో నగరంలో ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కోన్నారు. కొన్ని ప్రాంతాలలో విద్యుత్‍ స్తంభాలు విరిగిపడగా భారీ వృక్షాలు కూలిపోయాయి. నగరంలోని పలు ప్రాంతాలు వరదనీటితో మునిగిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో నగరంలోని ప్రధాన కూడళ్ళు, కాలనీలలో వరద నీటితో నిండిపోయాయి.

లక్ష్మిపురం కూడలి, రామానుజం కూడలి, తూర్పు పోలీస్‍ స్టేషన్‍ అండర్‍ బ్రిడ్జి, బాలాజీకాలనీ అండర్‍ బ్రిడ్జి, దొడ్డాపురం వీధితో పాటు పలు ప్రాంతాలలో వరదనీరు చేరాయి. లక్ష్మిపురం కూడలిలో చెట్టు కూలిపోయింది. దొడ్డాపురం వీధిలో పలు ప్రాంతాలలో విద్యుత్‍ స్తంభాల విరిగిపడ్డాయి. జై భీమ్‍ నగర్‍ కాలనీలో ఇళ్ళల్లోకి వరదనీరు చేరింది. 12వ డివిజన్‍ పలు ప్రాంతాలలో వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

తడిసి ముద్దైన తిరుమల కొండ: తిరుమలలో మాండౌస్ తుపాన్‌ తీవ్ర ప్రభావాన్నిచూపిస్తోంది. దాదాపు రెండు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి శ్రీవారి కొండ తడిసి ముద్దయ్యాంది. తిరుమలలోని అన్ని జలాశయాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, శ్రీవారి పాదాలు తీర్థాలకు వెళ్లే మార్గాలను తి.తి.దే. మూసేసింది. తిరుమలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. తుపాను కారణంగా శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రాష్ట్రంలో మాండౌస్​ తుపాన్​ బీభత్సం

ఇవీ చదవండి:

Last Updated : Dec 10, 2022, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details