ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఐదేళ్ల కిందటి చేదు అనుభవం నుంచి నేర్చుకోని పాఠాలు - ఐదేళ్ల కిందటి చేదు అనుభవం నుంచి నేర్చుకోని పాఠాలు

నెల్లూరు నగరం వర్షాకాలంలో ఏటా ముంపుతో అవస్థలు పడుతోంది. కొన్ని కాలనీల్లో పీకల్లోతు నీరు నిలుస్తోంది. స్వర్ణాల చెరువు నుంచి వస్తున్న వరద నగరాన్ని ముంచేస్తోంది. 2015లో వచ్చిన వరద నగరవాసులను వారంపాటు కునుకు లేకుండా చేసింది. తాజాగా మళ్లీ అదే పరిస్థితి కళ్లముందు సాక్షాత్కరించింది.

rain in Nellore
rain in Nellore

By

Published : Nov 13, 2020, 11:37 AM IST

నెల్లూరు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 2015 నవంబరులో వచ్చిన భారీ వరదతో నగరంలోని సగం ప్రాంతం మునిగిపోయింది. 50 వేలకుపైగా కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు బోట్లను వాడాల్సి వచ్చింది. నగర పరిధిలో 52 కి.మీ.కుపైగా రహదారులు దెబ్బతిన్నాయి. 906 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. అప్పటి సీఎం చంద్రబాబు 3రోజులపాటు నెల్లూరులోనే ఉండి సహాయ చర్యలను సమీక్షించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు పది రోజులు పట్టింది. నగరపాలక సంస్థకు రూ.110 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది.

ఐదేళ్ల కిందటి చేదు అనుభవం నుంచి నేర్చుకోని పాఠాలు

శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలివి..

స్వర్ణాల చెరువు నుంచి వర్షపు నీరు నగరంలోకి రాకుండా పెన్నాలోకి మళ్లించాలి. నగర పరిధిలోని 14 పంట కాలువలపై దాదాపు 5వేల ఆక్రమణలను తొలగించి, పేదలకు మరోచోట ఇళ్లు కేటాయించాలి. ఆక్రమణలతో వందడుగుల నుంచి 30 అడుగులకు కుంచించుకుపోయిన కాలువలను బాగు చేయాలి. నగరంలో కొత్తగా భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ)ను నిర్మించాలి.

ఐదేళ్లలో ఏం చేశారు?

*స్వర్ణాల చెరువు నుంచి నగరంలోకి నీళ్లొచ్చే కలుజుని మూసి మరో మార్గంలో వర్షపు నీరు పెన్నాలో కలిసేలా ఏర్పాట్లు చేశారు. చెరువుగట్టును ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేశారు. చెరువులో నీరు కొట్టేపాలెం వెళ్లేమార్గంలో రోడ్డుపైనుంచి పెన్నాలో కలవడంతో రాకపోకలకు అంతరాయమేర్పడుతోంది. ఇటీవలి వర్షాలకు వాహనచోదకులు ఈ రోడ్డుపై ఇక్కట్లు పడ్డారు. స్వర్ణాల చెరువు, పెన్నా నది మధ్య ఉన్న కాలువలోనూ పూడిక పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకులేర్పడుతున్నాయి. చెరువు గర్భంలోనూ ఆక్రమణలు తొలగించలేదు ఈ కారణంగా మళ్లీ వరదకు ఆస్కారం ఏర్పడింది.

*పంట కాలువలపై ఆక్రమణల తొలగింపు ప్రహసనంగా మారింది. కాలువలపై తాత్కాలిక ఆవాసమేర్పరుచుకున్న వారిలో దాదాపు 3వేల మందికి నెల్లూరులో పీఎంఏవై- ఎన్టీఆర్‌నగర్‌ పేరుతో నిర్మించిన మోడల్‌ కాలనీలో గత ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది. ఆక్రమణల తొలగింపు ప్రయత్నాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తంకావడం, ఇతర రాజకీయ కారణాలతో చివరి క్షణంలో అధికారులు వెనక్కి తగ్గారు. మోడల్‌ కాలనీలో గృహప్రవేశాలు కూడా నిలిచాయి.

*కాలువలను విస్తరించడంతోపాటు వరద ప్రవాహానికి వీలుగా అభివృద్ధి చేసే పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఇందుకోసం రూ.60 కోట్లతో అంచనాలు రూపొందించి రామిరెడ్డి కాలువలో సీఏఎం ఉన్నత పాఠశాల వద్ద పనులు ప్రారంభించారు. 30% పనులయ్యాక రాజకీయ కారణాలతో నిలిపేశారు. రూ.564.84 కోట్ల హడ్కో సాయంతో చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) పనులు ఇంకా పూర్తి కాలేదు. మురుగునీటి శుద్ధి కేంద్రాలు(ఎస్‌టీపీ) అందుబాటులోకి రాలేదు.

రాష్ట్రవ్యాప్తంగా నగరాలకు ముంపు భయం

భారీ వర్షాలు కురిశాయంటే నెల్లూరే కాదు.. రాష్ట్రంలోని మరో 4నగరాలు, 25పురపాలక సంఘాల పరిధిలో పలు ప్రాంతాలు మునుగుతున్నాయి. విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడలలో ఈ సమస్య తీవ్రం. విశాఖలోని షీలానగర్‌ ఇటీవలి వర్షాలకు ముంపును ఎదుర్కొంది. ప్రకాశం బ్యారేజీ నుంచి గరిష్ఠంగా 7.50 లక్షల క్యూసెక్కులను దిగువకు విడిచిపెట్టడంతో విజయవాడలో నదిని ఆనుకొని ఉన్న కృష్ణలంక నుంచి రొయ్యూరు వరకు ముంపునకు గురయ్యాయి. ఈ ప్రాంతాల్లో రక్షణ గోడ పనులు మందకొడిగా సాగుతున్నాయి.

సమస్య పరిష్కారానికి ప్రణాళిక

భారీ వర్షాలతో నగరాలు, పట్టణాల్లో ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలపై ఆలోచిస్తున్నాం. కలెక్టర్లు, నగర, పురపాలక కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి చెరువులు, కాలువల ఆక్రమణల గుర్తింపుతోపాటు సమస్య పరిష్కారంపై అధ్యయనం చేయాలని సూచించాం. - బొత్స సత్యనారాయణ, పురపాలక మంత్రి

ఇదీ చదవండి:'పోలవరానికి కేంద్రం సహకరిస్తోంది.. ప్రాజెక్టు డిజైన్​లో మార్పులు ఉండవు'

ABOUT THE AUTHOR

...view details