నెల్లూరు జిల్లాలో వ్యవసాయం, ఆక్వా రంగాల తర్వాత ఉద్యాన పంటలదే పైచేయి. జిల్లాలో ఈ ఏడాదీ దాదాపు 50 వేల హెక్టార్లలో నిమ్మ, అరటి, జామ, బొప్పాయి, చీనీ, మామిడి, తదితర రకాలు సాగవుతున్నాయి. ఇందులో నిమ్మ సాగుదే అగ్రస్థానంగా చెప్పొచ్చు. దాదాపు లక్ష ఎకరాల్లో నిమ్మ సాగు ఉండగా.. పొదలకూరు, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలో ఈ తోటలు విరివిగా విస్తరించి ఉన్నాయి. ఆ తర్వాత ప్రాధాన్యం అరటిది కాగా.. బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కొడవలూరు, సంగం, తదితర మండలాల్లో సాగవుతోంది.
ఎంతో ఉపయోగం
నిమ్మ అనుబంధంగా జ్యూస్ తయారీ పరిశ్రమలు జిల్లాకు వస్తే ఎంతో మేలని రైతులు కోరుతున్నారు. గింజలు, తొక్క నుంచి నూనెల ఉత్పత్తి చేసే అవకాశం ఉందని.. ఫార్మా రంగంలోనూ ‘సి’ విటమిన్ మాత్రల తయారీలో నిమ్మను వాడుతుండటంతో ఆ తరహా కర్మాగారాల ఏర్పాటు చేయాల్సి ఉంది. అరటి పరంగా నార ఉత్పత్తి, చిప్స్, జ్యూస్, జామ్ రూపొందించే పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నది వినతి. ప్రస్తుతం జిల్లాకు చెందిన గౌతంరెడ్డి పరిశ్రమలశాఖ మంత్రిగా బాధ్యతలు చూస్తున్న క్రమంలో ఆయన చొరవ చూపాలని వేడుకుంటున్నారు. గ్రామాల్లో ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసి ఉద్యాన రైతులను సంఘటితం చేయటంతో పాటు శీతల గిడ్డంగులను ఏర్పాటు చేసి రైతులకు ఊతమివ్వాలని కోరుతున్నారు.
ఊరగాయలు, పచ్చళ్ల తయారీ మేలు
నిమ్మకాయల దిగుబడికి సీజన్ అనేది లేదు. నిమ్మ మార్కెట్లకు అనుగుణంగా ప్రభుత్వం ఊరగాయలు, పచ్చళ్ల పరిశ్రమలు స్థాపించాలి. గ్రామాల్లో రైతు సంఘాలను ఏర్పాటు చేసి తద్వారా పొరుగు రాష్ట్రాలకు సరకు తీసుకెళ్లి అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి. -- రాంబాబునాయుడు, నిమ్మరైతు, బాలాయపల్లి
పరిశ్రమలు పెట్టాలి
మాకు అరటి దిగుబడులు బాగున్నా మార్కెట్లో ధరలు లేనప్పుడు, మూతపడినప్పుడు కష్టమంతా వృథా అవుతోంది. అరటి అనుబంధ పరిశ్రమలు, శీతల గోదాములను అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుంది. -- శ్యాంబాబు, కాలయ కాగొల్లు, బుచ్చిరెడ్డిపాళెం మండలం