DAGADARTHI AIRPORT : గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆపేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో నెల్లూరు జిల్లాలోని దగదర్తి విమానాశ్రయం కూడా చేరింది. దీనికోసం అప్పటి తెదేపా ప్రభుత్వం భూ సేకరణ, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినా.. అవేమీ పరిగణనలోకి తీసుకోకుండా విమానాశ్రయాన్ని తరలించాలని నిర్ణయించింది. తెట్టు దగ్గర కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనికోసం సుమారు 2వేలకు పైగా ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో కొంతమేర అటవీ భూములున్నాయి. వీటిని సేకరించడానికి కేంద్ర అనుమతి కోసం ప్రతిపాదన పంపింది.
అనుమతులు రావడానికి.. భూసేకరణ పూర్తి చేయడానికి.. పౌర విమానయాన సంస్థ నుంచి సమాధానం రావడానికి కనీసం ఏడాదికి పైగా పడుతుందని అధికారుల అంచనా. దగదర్తి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియపై కోర్టు వివాదాలు పరిష్కారం కావడానికి ఏళ్ల సమయం పట్టింది. ఇదే తీరులో ప్రస్తుతం విమానాశ్రయానికి ప్రతిపాదించిన భూములపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఏంటనే దానిపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దగదర్తి దగ్గర విమానాశ్రయ నిర్మాణానికి రూపొందించిన ప్రతిపాదనను ...వైకాపా ప్రభుత్వం ఉపసంహరించింది. ఇప్పటికే సేకరించిన 13వందల 15 ఎకరాల భూములను సర్కారు ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.