మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగపై ప్రభుత్వం నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తోందని తేదేపా నేత అబ్దుల్ అజీజ్ విమర్శించారు. కొవిడ్ కారణంగా భక్తుల ప్రవేశాన్ని నిషేధించి.. ఆ సమాచారాన్ని ప్రచారం చేయడంలో అధికారులు అలసత్వం వహించారని ఆయన మండిపడ్డారు. బారాషహీద్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించిన అబ్దుల్ అజీజ్, కరోనా పోవాలంటూ స్వర్ణాల చెరువులో రొట్టె పట్టారు.
పండగకు అనుమతి లేదన్న సమాచారం తెలియక దూరప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జిల్లా సరిహద్దుల్లోని భక్తుల రాకపోకలకు అరికట్టి, దర్గాకు ఇప్పటికే చేరుకున్న భక్తులను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ మొక్కులు తీర్చుకునేందుకు అనుమతించాలని ఆయన కోరారు. రొట్టెల పండుగను జాతీయ పండుగగా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రొట్టెల పండుగ ప్రార్థనలు అంతర్గతంగా జరుగుతున్నా.. దర్గా ప్రాంగణాన్ని సక్రమంగా శుభ్రం చేయకపోవడం బాధాకరమన్నారు. భక్తి విశ్వాసాలకు ప్రతీకైన బారాషహీద్ దర్గాపై అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.