ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శిథిల భవనాల్లో చదువులు.. అభివృద్ధిని మరచిన అధికారులు - Problems of Moolapeta Girls High School Students

శిథిల భవనాలు అధికారుల క్రమ శిక్షణలేమిని గుర్తుచేస్తున్నాయి. పాచిపట్టిన గోడలు వెకిలిగా నవ్వుతున్నాయి. పెచ్చులు ఊడిపడుతున్న రేకుల షెడ్లు, రేపటి బంగారు భవిష్యత్తుకు అడ్డు పడుతున్నాయి. గది బయట ఉన్న చెత్త, చెదారం ఆసక్తిని అంధకారంలోని నెట్టేస్తున్నాయి. చుట్టూ ఉన్న వ్యర్థాలు, పిచ్చి చెట్లు వచ్చేవారిని భయపెడుతున్నాయి. ఇదంతా నెల్లూరు నగరంలోని మూలపేట బాలికల పాఠశాల ప్రస్తుత పరిస్థితి. ఆ బడిలో విద్యార్థినులు ఎదర్కొంటున్న సమస్యలు.. పడుతున్న అవస్థలపై ఈటీవీ భారత్​ కథనం...

girl high school students-face-many-difficulties
శిథిల భవనాల్లో సాగని చదువులు

By

Published : Dec 1, 2020, 7:48 PM IST

శిథిలావస్థలో మూలపేట బాలికల ఉన్నత పాఠశాల శిథిలం

నెల్లూరు నగరంలోని మూలపేట బాలికల ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. బడిలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నగరం నడిబొడ్డులో ఉన్నందున తమ పిల్లలను ఇక్కడ చదివించడానికి ఒకప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి చూపేవారు. గతంలో 400మంది విద్యార్థులున్న ఈ బడిలో ప్రస్తుతం 250మంది మాత్రమే చదువుతున్నారు. శిథిల భవనాలను చూసి పిల్లలను పంపేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేస్తున్నారు. రోడ్డుకు పక్కనే ఉండటం వల్ల కాస్త వర్షం పడితే చాలు బురద బెడద పాఠశాలను వెంటాడుతోంది. 50ఏళ్ళనాటి భవనాలు కావడంతో అవి పూర్తిగా శిథిలమయ్యాయి. తరగతిలో బోధన సాగుతుంటే భవనంపై నుంచి పెచ్చులూడి పడుతున్నాయి. కూలడానికి సిద్ధంగా ఉన్న గదుల మధ్య తరగతులు కొనసాగుతున్నాయి.

సదుపాయాలు దయనీయం..

పాఠశాల పరిస్థితి దయనీయంగా మారింది. గదులకు తుప్పుపట్టిన ఇనుపతీగలు తప్ప తలుపులు, కిటికీలు లేవు. విరిగిన రేకుల షెడ్లు కావడం వల్ల ఎండా, వానా గది లోపలికి ప్రవేశిస్తున్నాయి. తరగతి గది బైట పిచ్చిమొక్కలు పెరిగాయి. చెత్తా చెదారంతో బడి ఆవరణం అధ్వానంగా మారింది. 250మంది బాలికలకు కేవలం మూడు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో నీటి సదుపాయం లేక నిరుపయోగంగా పడి ఉన్నాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో విద్యార్థినులు ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే పాఠశాల మూతపడే పరిస్థితి ఎంతో దూరంలో కనిపించడం లేదు.

పునర్ వైభవం కావాలి

నాలుగేళ్ళ కిందట బడిలో మూడు నూతన భవనాలను నిర్మించారు. వాటిని కేవలం సమావేశాలకు మాత్రమే వినియోగించుకుంటున్నారు. విద్యార్థులకు తరగతి గదులు లేవని తెలిసినా అధికారులు మాత్రం నూతన గదులను సమావేశాలకు వాడుకోవడం గమనార్హం. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్థానిక బాలికల పాఠశాల అభివృద్ధిపై దృష్టి పెట్టి పునర్ వైభవం తీసుకురావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

సర్కారు జలం.. రోగాలు ఉచితం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details