సరదాగా ఊగుతున్న ఊయలే ఆ బాలికకు ఉరితాడైంది. అప్పటివరకు చెల్లెలితో ఆడుకున్న ఆ చిన్నారి పాలిట ఊయలే యమపాశంగా మారడంతో ఊపిరి ఆగింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రులు తల్లిడిల్లిపోతున్నారు. ఈ విషాద ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని చెర్లోపల్లిలో శనివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన సజ్జనపు రవీంద్ర, సత్యవతికి ఇద్దరు కుమార్తెలు. రవీంద్ర కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె కోసం ఇటీవల ఇంట్లో చీరతో ఊయల కట్టారు. శనివారం పెద్దకుమార్తె మోక్షిక(6) తండ్రి బయటకు వెళ్లేటప్పుడు ఎదురొచ్చి జాగ్రత్తగా వెళ్లిరా నాన్న అని చెప్పింది. తల్లి ఇంటి పనులు చేసుకుంటుండగా.. చెల్లి కోసం కట్టిన ఊయలలో మోక్షిక ఊగుతోంది. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఊయల మెలితిరిగి చిన్నారి మెడకి చుట్టుకుంది. దీంతో ఊపిరి అందకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కొద్దిసేపటి తరువాత గమనించిన తల్లి సత్యవతి చిన్నారిని చికిత్స నిమిత్తం మనుబోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
అమ్మ కట్టుకున్న చీరే ఊయల రూపంలో ఊపిరి తీసింది - చెర్లోపల్లిలో బాలిక మృతి న్యూస్
ఆ ఊయలే తన పాలిట యమపాశంగా మారుతుందని ఆ చిన్నారికి తెలియదు పాపం... ఆనందంగా గాల్లో తేలుతున్నట్లు చేసే ఆ ఊయలే.. తనకు ఊపిరాడకుండా చేస్తుందని ఊహించి ఉండదు... సరదాగా అమ్మ చీరతో కట్టిన ఊయలలో ఊగుతూ పరవశించిన.. ఆ చిన్నారి మెడకు ఆ ఊయల ఉరితాడుగా మారి, ప్రాణాలు తీసింది.
బాలిక మృతి