ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాంధీజీ ప్రారంభించిన పినాకిని ఆశ్రమం... నేడు పర్యటక ప్రాంతం... - పల్లిపాడులో సబర్మతి ఆశ్రమం

నెల్లూరు జిల్లా పల్లిపాడులోని గాంధీజీ ఆశ్రమం దక్షిణ భారత సబర్మతిగా పేరుగాంచింది. మహాత్ముడు నడిచిన సత్యాగ్రహ ఆశ్రమానికి అనేక రాష్ట్రాల నుంచి పర్యటకులు తరలివస్తుంటారు. పినాకిని నదితీరాన గాంధీజీనే.. స్వయంగా ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఎంతో ప్రశాంత వాతావరణంలోని ఈ ఆశ్రమం పర్యటక నేడు కేంద్రంగా మారింది.

gandhi-trust-in-nelluru-pallipadu
gandhi-trust-in-nelluru-pallipadu

By

Published : Dec 24, 2019, 6:15 AM IST

గాంధీజీ ప్రారంభించిన పినాకిని ఆశ్రమం... నేడు పర్యటక ప్రాంతం...

నెల్లూరు జిల్లా... ఇందుకూరుపేట మండలం పల్లిపాడులో గాంధీజీ ప్రారంభించిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం రెండో సబర్మతిగా పేరుగాంచింది. స్వాతంత్య్ర ఉద్యమం గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం కేంద్రంగా ఊపందుకోగా, దక్షిణ భారతదేశంలో పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ కేంద్రంగా ఉద్యమం నడిచింది.

దక్షిణాదిన ఆశ్రమం స్థాపిస్తే స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకుంటుందని పల్లిపాడుకు చెందిన చతుర్వేదుల కృష్ణమూర్తి మహాత్ముడికి సూచించారు. ఇందుకు పినాకిని తీరంలోని పల్లిపాడులో 16 ఎకరాల భూమిని పొనకా కనకమ్మ దానంగా ఇచ్చారు. దక్షిణాఫ్రికాకు చెందిన రుస్తుంజీ రూ.10వేలు, స్థానిక ఉద్యమకారుల విరాళాలతో ఆశ్రమం రూపుదిద్దుకుంది. 1921 ఏప్రిల్‌ 7న గాంధీజీ పల్లిపాడు గ్రామానికి వచ్చి ఆశ్రమాన్ని ప్రారంభించారు.

అప్పటి నుంచి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ కేంద్రంగా స్వాతంత్య్ర ఉద్యమం ఈ ప్రాంతంలో ఊపందుకుంది. 1965 వరకు ఆశ్రమంలో నూలు వడకడం, ఇతర సేవా కార్యక్రమాలు జరిగేవి. ఆ తర్వాత ఆశ్రమం ప్రాభవం కోల్పోయింది.

2006లో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో పినాకిని అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జాతిపిత మనవడు తుషార్‌గాంధీ, పలువురు గాంధేయవాదులు, గవర్నర్లు, మంత్రులు పర్యటించి నాటి సంఘటనలు గుర్తుకు వచ్చేలా సుందరంగా ఆశ్రమాన్ని తీర్చిదిద్దారు.

ప్రస్తుతం యువత, విద్యార్థులకు మహాత్ముడి బోధనలు తెలియజేస్తూ బాపు బాటలో పయనించేందుకు కృషి చేస్తున్నారు. గాంధీజీ చేతుల మీదుగా నిర్మితమైన ఈ ఆశ్రమం దేవాలయమని విద్యార్థులు అంటున్నారు. ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉందని... ఇక్కడకు వచ్చిన ప్రతీసారీ ఎంతో స్ఫూర్తిని పొందుతున్నామని చెబుతున్నారు. వారి మార్గాలు ఎందరికో ఆదర్శనీయమని ఇక్కడికి వచ్చేవారంతా కొనియాడుతున్నారు. ఏడాది పొడవునా పర్యాటకులు ఇక్కడ సందడి చేస్తుంటారు.

పర్యటకుల్ని ఆకట్టుకునేందుకు గాంధీ మ్యూజియం, యాంపిథియేటర్ నిర్వహణ, గ్రంథాలయ నిర్మాణాలను పర్యటక శాఖ వారు చేప్పట్టారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి ఆశ్రమాన్ని పర్యటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ పనులు పూర్తి చేస్తే గాంధీజీ ఆశయాలను మరింత ప్రచారంలోకి తీసుకుపోయే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

'కడప ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తా'

ABOUT THE AUTHOR

...view details