రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసే పనులకు ముఖ్యమంత్రి జగన్ తన పేరు పెట్టుకోవడం సరికాదన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. పేదల ఇళ్ల కోసం ఒక్కొక్క ఇంటికి లక్షన్నర రూపాయల చొప్పున ప్రధాని మోదీ ఏపీకి 31 వేల కోట్ల కేంద్ర నిధులు ఇచ్చారన్నారు. జగన్ ఇంటి పట్టా కోసం పేరుతో కేవలం రూ.25 వేలే ఖర్చు చేసి.. కేంద్ర నిధులనూ వైకాపా దోపిడీ చేస్తోందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో నిర్మించే ఇళ్లకు జగనన్న సొంతింటి కల అని పేరు పెట్టుకోవడం ఏంటని నిలదీశారు.
ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద కేంద్ర నిధులు రూ.11 వేల కోట్లతో ఆర్బీకేలు, ఆరోగ్య క్లినిక్లు నిర్మాణాలు జరుగుతుంటే..జగనన్న క్లినిక్లు అని పేరు పెట్టడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో బెంగళూరు నుంచి తిరుపతికి.. తిరుపతి నుండి శ్రీకాళహస్తికి కేంద్ర ప్రభుత్వం నాలుగు లైన్ల రోడ్లను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రధాని కృషితోనే మొత్తం రూ.50 వేల కోట్లతో ఏపీలో రోడ్ల అభివృద్ధికి పనులు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో రెండు వేల కోట్లతో రోడ్ల అభివృద్ధికి టెండర్లు వేస్తే.. ఆ బిల్లులు సకాలంలో రావని ఊహించిన కాంట్రాక్టర్లు.. పనులను తీసుకోవడానికి ముందుకు రావడం లేదంటేనే రాష్ట్రం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో ప్రజలకు అర్థమవుతోందన్నారు. దేవస్థానంలో మతతత్వ రాజకీయాలకు జగన్ ప్రభుత్వం స్వస్తి పలకాలని వీర్రాజు హితవు పలికారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో భాజపా తిరుపతి పార్లమెంట్, జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు.