Telugu Desam leaders comments: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పతనం ప్రారంభమైందని మాజీ మంత్రులు, తెలుగుదేశం నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, అమర్నాథ్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్రకు అపూర్వ స్పందన వస్తోందని చెప్పారు. ఈ పాదయాత్ర లోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోకి రావడం శుభ పరిణామమన్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించేందుకు పార్టీ ముఖ్య నేతలు బీద రవిచంద్ర నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులతోపాటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, బీసీ జనార్దన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వీరు చర్చించారు. కలిసికట్టుగా ముందుకు వెళ్లి రానున్న ఎన్నికల్లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు తామంతా కృషి చేస్తామన్నారు.
యువగళం పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక వైఎస్సార్సీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి నారాయణ నెల్లూరును అన్ని విధాల అభివృద్ధి చేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాటిని నిలిపేసిందని విమర్శించారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక తిరిగి అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ గౌరవ, మర్యాదలు పెంచేలా పార్టీ కోసం పని చేస్తానని ఎమ్మెల్యే కోటారెడ్డి శేఖర్ రెడ్డి చెప్పారు. పార్టీ అధినేత ఆదేశానుసారమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఈ సందర్భంగా నారాయణ వెల్లడించారు.