Fire Crackers Price: దీపావళి పండగ అంటే ఇల్లు దీపాల వెలుగులతో మెరిసిపోతుంటుంది. దీపావళికి ఇంటిని శుభ్రం చేసి దీపాలు వెలిగిస్తే లక్ష్మీ మాతా అనుగ్రహం ఉంటుందని ప్రజలు భావిస్తారు. దీపాల వెలుగుతో పాటు దీపావళి అంటే గుర్తుకు వచ్చేది బాణసంచా. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు టపాసులు, చిచ్చుబుడ్లు, కాకర పువ్వోత్తులు ఇలా ఎదో ఒకటి కాల్చి సంతోషిస్తారు. కానీ, ఈ సంవత్సరం ప్రజలకు ఈ సంతోషం అందని ద్రాక్షలాగా మారింది. బాణసంచా ధరలు పెరిగిపోయాయి. దీంతో బాణసంచా కాల్చలంటేనే ప్రజలు వాటి ధరలు చూసి భయపడుతున్నారు.
నెల్లూరు నగరంలో వీఆర్సీ, ఆర్ఎస్ఆర్ స్కూల్ మైదానం, వైఎంసీ గ్రౌండ్ వద్ద బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేశారు. దుకాణాలలో బాణసంచా కొనుగోలు చేయటానికి వచ్చిన కొనుగొలుదారులు ధరలను చూసి వాపోతున్నారు. గత ఏడాది 200 వందల రూపాయలకు లభించిన బాణసంచా.. ఈ సంవత్సరం 300 నుంచి 400 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. రెండు వేలు వెచ్చించి బాణసంచా కొనుగొలు చేసినా.. సంచి నిండటం లేదని వాపోతున్నారు. జీఎస్టీ కారణంగానే బాణసంచా ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. ప్రతి ఏడాది బాణసంచా ధరలు పెరగకుండా ప్రభుత్వం నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.