ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాన్నే.. ఆయువు తీశాడు - ozili crime news

నిండు పున్నమి వేళ.. చంద్రుడి వెలుగుల్లో ఆ చిన్నారి మోము ఎవరికైనా ముద్దొస్తుంది. పట్టుదుస్తుల్లో ఉన్న ఆ బుజ్జాయిని పొత్తిళ్లలో దాచాలనిపిస్తుంది. ఆ లేలేత బుగ్గలను తాకుతూ.. పసిపాపను ఆడించాలని.. ఆ కల్మషంలేని నవ్వులు చూస్తూ జీవితం గడిపేయాలనిపిస్తుంది.. కానీ ఆ చిన్నారి పట్ల కన్నతండ్రే కాలయముడయ్యాడు. కల్లాకటపం ఎరుగని కుమార్తెను మద్యం మత్తులో చిదిమేశాడు. నెలల బిడ్డ ఆయువుతీశాడు.

father killed daughter in alcohol intoxication
father killed daughter in alcohol intoxication

By

Published : Jun 25, 2021, 9:23 AM IST


నెల్లూరు జిల్లా ఓజిలి మండలం బట్లకనుపూరులో హృదయ విదారక ఘటన జరిగింది. మద్యం మత్తులో తండ్రి.. కూతుర్ని బలి తీసుకున్నాడు. మద్యం మత్తులో బిడ్డను చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో పడేశాడు.

నాన్నే.. ఆయువు తీశాడు

బట్లకనుపూరుకు చెందిన నిడిగంటి మధు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అప్పట్నుంచి మేనత్త ధనమ్మ దగ్గరే పెరిగాడు. నాలుగేళ్ల కిందట ముమ్మపాళేనికి చెందిన లీలావతితో పెళ్లయింది. వారికి ఇద్దరు కుమార్తెలుండగా..మధు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మేనత్త, భార్యతో రెండ్రోజులుగా గొడవ పడుతున్నాడు. గురువారం మరోసారి మద్యం తాగి.. తన రెండో కుమార్తె దివ్యశ్రీ(15 నెలలు)ని లాక్కొని వీధిలోకొచ్చాడు. తాగొచ్చిన సమయంలోనూ చిన్న కుమారైను ఆడించే అలవాటు ఉండటంతో.. వారిద్దరూ మిన్నకుండిపోయారు. కానీ మద్యం మత్తులో ఉన్న మధు బిడ్డను చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో పడేశాడు. కాసేపటికి భార్యకు ఫోన్‌ చేసి.. చెరువు వద్ద పాప ఉంది.. వచ్చి తీసుకెళ్లమని చెప్పి పరారయ్యాడు. ఆమె స్థానికులతో కలిసి అక్కడికి వెళ్లగా.. చిన్నారి మృతదేహం నీటిలో తేలుతుండటం చూసి.. కన్నీరుమున్నీరైంది. స్థానికులు పాపాయి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న సీఐ నరసింహారావు, ఎస్సై శేఖర్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడి మేనత్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details