పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాట ధర కల్పించాలని నెల్లూరు రైతులు డిమాండ్ చేశారు. కేంద్రాల్లో కొనుగోళ్లు మొక్కుబడిగా మారాయని.. గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు పేర్కొన్నారు. కేంద్రాల్లో ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడానికి సవాలక్ష కారణాలు చెబుతూ.. ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా ఆధ్వర్యంలో నెల్లూరులో రైతులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలోని గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. తెల్లచొక్కా, పంచా ధరించి జిల్లా రైతులు నెల్లూరులో కదంతొక్కారు. నర్తకీ కూడలి నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. సాగు ఖర్చులు పెరిగాయని.. పంటకు ధర లేకపోవడంతో రైతులు అప్పులు పాలవుతున్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి అన్నారు. సంగంలో ఓ రైతుకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యయత్నం చేశాడని.. జిల్లాలో అనేక మంది రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.