విత్తనాల కోసం అన్నదాతల తంటాలు - నెల్లూరు
చినుకు రాలదు...విత్తు అస్సలు దొరకదు. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఓ వైపు వానలు రాక.. మరోవైపు విత్తనాల కోసం అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు వ్యవసాయ కార్యాలయంలో విత్తనాల కోసం వేలసంఖ్యలో రైతులు ఎగబడ్డారు. చేతులెత్తేసిన అధికారులు తలుపులు మూసివేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు వ్యవసాయ కార్యాలయంలో వేరుశనగ, పెసర విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచి వేచిచూశారు. వేల మంది రావడంతో స్వల్ప తోపులాట జరిగింది. దిక్కుతోచక అధికారులు విత్తనాలు ఇవ్వలేమంటూ తలుపులు మూసివేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వదులుకొని తెల్లవారుజామున 5 గంటల నుంచి కార్యాలయానికి చేరుకొని విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక్కో పంచాయతీ లెక్కన రైతులకు సమాచారం ఇచ్చి విత్తనాలను పంచేవారు. ఈరోజు మండలంలోని రైతులందరినీ పిలవడంతో...వేలసంఖ్యలో రైతులు కార్యాలయానికి చేరుకున్నారు. వచ్చినవారికి విత్తనాలు ఇవ్వలేక.. అదుపు చేయలేక అధికారులు చేతులెత్తేశారు.