నెల్లూరులోని సోమశిల జలాశయం పరిధిలో నీరు విడుదల చేస్తే సుమారు అయిదు లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ప్రస్తుతం ఉన్న 51.65 టీఎంసీల నీటితో మొత్తం రెండో పంట పండే అవకాశం ఉంది. కానీ, డెల్టాలో సర్వేపల్లి కాలువ, జాఫర్‌సాహెబ్ కాలువ మినహా నీరందిస్తున్నారు. ఇప్పటికే కావలి, కనుపూరు కాలువలకు విడుదల చేయగా... దక్షిణ కాలువ పరిధిలో పూడిక పనులు జరుగుతుండటంతో జాప్యం కానుంది. ఈ కాలువ పరిధిలో 30వేల ఎకరాలకు సాగునీరిస్తామని అధికారులు చెబుతుండగా... ఉత్తర కాలువ పరిధిలో మాత్రం నీటి విడుదల రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా లేదన్నమాట వినిపిస్తోంది. మొదటి పంటకు కాలువ పరిధిలో రాళ్లపాడు వరకు సుమారు 60వేల ఎకరాలకు పైనే సాగునీరిచ్చారు. ప్రస్తుతం కేవలం 23 కిలోమీటరు వరకు 11 వేల ఎకరాలకే అందించాలని నిర్ణయించడం రైతులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. తాజా నిర్ణయం వల్ల అనంతసాగరం మండలంలోని కొంత ప్రాంతానికే సాగునీరు పరిమితమవుతుందని, ఆత్మకూరు, అనుమసముద్రంపేట, కలిగిరి, కొండాపురం, రాళ్లపాడు ప్రాంతాలకు అందుబాటులోకి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనులతోనే...
సోమశిల జలాశయం పరిధిలో రెండో పంటకు సాగునీరిస్తున్నాం. జాఫర్‌సాహెబ్ కాలువ, సర్వేపల్లి కాలువ మినహా డెల్టా మొత్తం ఇస్తున్నాం. పూడిక పనులతో సాగునీరు ఆలస్యంగా ఇవ్వాలని దక్షిణ కాలువ రైతులే కోరారు. ఇక ఉత్తర కాలువ వెడల్పు పనులు ఉన్నాయి. దాంతో 23వ కిలోమీటరు వరకే సాగునీరు ఇస్తున్నాం. ఈ కాలువ ద్వారా సుమారు 11 వేల ఎకరాల్లో సాగునీరిస్తాం. - కృష్ణారావు, ఎస్‌ఈ, సోమశిల ప్రాజెక్టు