రాష్ట్రంలో జామాయిల్ సాగు 1.5 లక్షల హెక్టార్లలో ఉంది. ఇందులో రాజమహేంద్రవరం తర్వాత, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు విస్తీర్ణంలో ముందున్నాయి. ఆయా ప్రాంతాల్లో రైతులు దీని సాగుపై మక్కువ చూపుతున్నారు. గతంలో కర్ణాటక ప్రాంతాలకు కర్ర సరఫరా చేసే పరిస్థితి ఉండేది. తాజాగా చిత్తూరుజిల్లా తొట్టంబేడులో ఓ పరిశ్రమ జామాయిల్ కర్ర ముడిసరకుగా తీసుకుంటోంది. ఖాళీ భూముల్లో సాగు విపరీతంగా పెరిగింది.
వర్షపాతం అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో హెక్టారుకు 70 నుంచి 80 టన్నులు దిగుబడి వస్తుండగా.. తక్కువ వర్షపాతం ప్రాంతాల్లో 40 నుంచి 50 మధ్యలో ఉంటోంది. కాగిత పరిశ్రమ బాగున్న రోజుల్లో టన్ను ధర రూ.4,200 పలికింది. రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో జామాయిల్‌కు మంచి గిరాకీ ఉండేది. ప్రస్తుతం టన్ను రూ.2,500 కూడా లేకపోవడం గమనార్హం.ఆరేళ్ల పాటు కష్టపడి సాగు చేసే రైతులకు గిట్టుబాటు ఇవ్వని జామాయిల్ కర్ర.. దళారీలు, వ్యాపారులకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది.
రైతులకు టన్నుకు రూ.2,500 ఇస్తున్న దళారీలు దీన్ని పరిశ్రమకు రూ.2700 అమ్ముతున్నారు. దళారీకి టన్నుకు రూ.200 మిగులుతోంది. పరిశ్రమలో ఏడాది పొడవునా రోజూ దాదాపు 4 వేల టన్నులు కొనుగోలు జరుగుతోంది. అంటే రోజుకు దళారులు దోచేస్తోంది ఏకంగా రూ.8 లక్షలు. ఈమేరకు ఏడాదికి రూ.29 కోట్లకు పైనే జేబులో వేసుకుంటున్నారు.
రైతుల నోట్లో మట్టి : హెక్టారుకు దాదాపు 40 టన్నుల మేర దిగుబడి వస్తోందనుకుంటే రూ.లక్ష మేర ఆదాయం సమకూరుతుంది. తొలి పంట ఆరేళ్ల వరకు ఆగాల్సి ఉంది. ఏటా రూ.20 వేలు వ్యయం చేసినా రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. తొలి పంటలో మిగులు లేకపోగా రూ.20 వేలు నష్టపోతున్నారు. ఆ తర్వాత నుంచి పెట్టుబడి పెద్దగా లేకపోవడంతో అరకొరగా లాభం వచ్చే పరిస్థితి ఉండేది. తాజా పరిస్థితుల్లో అదీ ధరల పతనంతో పోయింది.