YSRCP MLA Mekapati Chandrasekhar Reddy meet with Vijayarami Reddy: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ రాజకీయం రానురానూ రసవత్తరంగా మారుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి, ఆ పార్టీ నేతలకు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో నియోజకవర్గ రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా రచ్చకెక్కింది. ఈ పరిణామాల మధ్య.. దుత్తలూరు మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డితో మేకపాటి తాజాగా భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ భేటీలో వారిద్దరూ ఏయే అంశాలపై చర్చించారు..?, చంద్రశేఖర్ రెడ్డి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో చేరుతారా..? లేదా..? 2024లో జరగబోయే ఎన్నికల సమయానికి ఆయన ఎటువైపు నిలబడతారు..? అనే విషయాలపై తీవ్రంగా చర్చ జరుగుతోంది.
రచ్చకెక్కిన ఉదయగిరి నియోజకవర్గ రాజకీయం..గతకొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి, ఆ పార్టీ ముఖ్య నేతలకు మధ్య జరిగిన సవాళ్లు, ప్రతిసవాళ్లతో నియోజకవర్గ రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో పార్టీ అధిష్ఠానం తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలపై ప్రతిపక్ష పార్టీ నాయకులతో చర్చలు జరుపుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డితో దుత్తలూరులో భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు కీలక విషయాలపై ఇద్దరు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా భవిష్యత్తు రాజకీయాలపై వీరిద్దరూ చర్చలు జరిపినట్లు సమాచారం.