ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆనందయ్య మందు పంపిణీని ఆపినవారిపై చర్యలు తీసుకోవాలి' - AP Latest News

ఆనందయ్య మందు పంపిణీని ఇన్ని రోజులు ఆపినవారిపై చర్యలు తీసుకోవాలని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. మందు పంపిణీ తిరిగి అందుబాటులోకి రావటం తమ ఘనతగా చెప్పుకోవటం దుర్మార్గమని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి దుయ్యబట్టారు. దళారుల అవతారమెత్తిన వైకాపా నేతలు రైతుల్ని దోచుకుంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. ప్రతి గింజా కొనుగోలు చేయకుంటే కరోనా నిబంధనలు లెక్కచేయకుండా రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By

Published : Jun 1, 2021, 3:45 PM IST

సజావుగా సాగుతున్న ఆనందయ్య మందు పంపిణీని ఇన్ని రోజులు ఆపినవారిపై చర్యలు తీసుకోవాలని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. చేపమందు పంపిణీ తరహాలో ఆనందయ్య మందు పంపిణీపై కలెక్టర్, ఎస్పీ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారా ఈ మందు పంపిణీ చేపట్టాలని చూడటం తగదని వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీల జోక్యం కనిపిస్తే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి పోరాడతామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హైకోర్టు ధర్మాసనం చొరవతోనే ఆనందయ్య వైద్యం తిరిగి అందుబాటులోకి వచ్చిందని అన్నారు.

21న వెంకయ్యనాయుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని మందు పంపిణీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారని... అయినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంటే హైకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వ చర్యల్ని తీవ్రంగా తప్పుబట్టిందన్నారు సోమిరెడ్డి. హైకోర్టు ఆదేశాల తర్వాత వైకాపా నేతలు మందు పంపిణీ తిరిగి అందుబాటులోకి రావటం తమ ఘనతగా చెప్పుకోవటం దుర్మార్గమని సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి దుయ్యబట్టారు.

దళారుల అవతారమెత్తిన వైకాపా నేతలు: నక్కా ఆనంద్ బాబు

దళారుల అవతారమెత్తిన వైకాపా నేతలు రైతుల్ని దోచుకుంటున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. మొక్కజొన్న కొనుగోళ్లలో మోసపూరిత విధానాలు అవలంభిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లు సక్రమంగా జరగట్లేదని ఆయన మండిపడ్డారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 22శాతం మాత్రమే రైతుల నుంచి కొనుగోలు చేశారన్న నక్కాఆనంద్‌బాబు... మిగిలిన 78శాతం రైతులు ఎక్కడ అమ్ముకోవాలని ప్రశ్నించారు. రైతుల కళ్లాల వద్దకు వెళ్లి ప్రతి గింజా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏ ఒక్కరైతు వద్దైనా అలా కొనుగోలు చేసిందా అని నిలదీశారు.

నక్కా ఆనంద్ బాబు

66 రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సిన కాటా కూలీ.. 250రూపాయల వరకూ వసూలు చేస్తున్నారని ఆనంద్ బాబు ఆరోపించారు. వీటన్నింటిపై విచారణకు ఆదేశిస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పరిహారం చెల్లింపులోనూ పార్టీల పరంగా చూసే నీచ సంస్కృతికి వైకాపా నేతలు తెరలేపారని దుయ్యబట్టారు. మూసివేసిన కొనుగోలు కేంద్రాలు మళ్లీ తెరిచి... ప్రతి గింజా కొనుగోలు చేయకుంటే కరోనా నిబంధనలు లెక్కచేయకుండా రైతుల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... Anandayya Medicine: ఆనందయ్య ఔషధం తయారీకి ముమ్మర ఏర్పాట్లు!

ABOUT THE AUTHOR

...view details