నాలుగు నెలలుగా ఎటువంటి ఫిర్యాదు లేని కాల్ సెంటర్! కరోనా పాజిటివ్ బాధితుల కోసం కాల్ సెంటర్లు నిరంతరం పని చేస్తున్నాయి. నాలుగు నెలలుగా బాధితులకు దిశా నిర్దేశం చేస్తున్నాయి. కాల్ సెంటర్లో పని చేసే ఉద్యోగులు ఎంతో ఓర్పుగా.. ప్రజల సమస్యలు విని, ప్రతి ఒక్కరికీ పరిష్కారం చూపిస్తున్నారు.
మాది ఉద్యోగమే కాదు.. బాధ్యతనీ.. సేవా భావంతో పని చేస్తున్నామంటున్నారు నెల్లూరు కాల్ సెంటర్లో పని చేసే సిబ్బంది. పని పట్ల ఇంత నిబద్ధత ఉండటంతోనే.. కాల్ సెంటర్‌పై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదంటున్నారు.
జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కాల్ సెంటర్లో... మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. ఈ కాల్ సెంటర్ ముగ్గురు జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఉంది.
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు గానీ... బాధిత బంధువులు గానీ కొంత కంగారుగా ఉంటారు. కాల్ సెంటర్‌కి వారు ఫోన్ చేయగానే.. సిబ్బంది బాధితులకు ధైర్యం చెప్తారు. బాధితులను ఇంటి దగ్గర నుంచి, కొవిడ్ కేర్ ఆసుపత్రిలో చేర్చేంత వరకు కాల్ సెంటర్ ఉద్యోగులు వారికి ఫోన్లో అందుబాటులోనే ఉంటారు.
ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కాల్ సెంటర్ ఏర్పాటు చేయటం జరిగింది. షిఫ్ట్‌కి ఐదుగురు చొప్పున, మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 6,210 కాల్స్ వచ్చాయి. 104 కోసం 80 మంది ఫోన్ చేశారు. - వీరాస్వామి నోడల్ అధికారి
ఆసుపత్రుల్లో వైద్య సేవలు సరిగా లేవనీ.. కరోనా టెస్టులు సరిగ్గా చేయటం లేదనీ ఫిర్యాదులు వస్తుంటాయి. విదేశాల నుంచి వస్తున్న వారు కూడా కాల్ సెంటర్‌కి సమాచారం అందిస్తున్నారు. గ్రామాల్లో పాజిటివ్ వచ్చిన వ్యక్తులు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరటం.. సంజీవని బస్సులు వచ్చే ప్రాంతాల విషయాలను తెలుసుకోవటం కోసం ఎక్కువ మంది ఫోన్ చేస్తున్నారు.- భారతీ, సోషల్ సైన్స్ లెక్చరర్