ఇల్లు అమ్మాలంటూ బెదిరింపులు! - elderly couple agitaion news in nellore
ఆక్రమణదారుల నుంచి తమను రక్షించాలంటూ నడవ లేని స్థితిలో ఉన్న ఓ వృద్ధ దంపతులు అధికారులను ఆశ్రయించారు. తమ ఇంటిని అమ్మాలంటూ ఇద్దరు వ్యక్తులు పేపర్ల మీద బలవంతంగా సంతకాలు తీసుకుని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి నిర్మించుకున్న ఇంటిని ఎలా విడిచివెళ్లాలంటూ కంటతడిపెట్టారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
![ఇల్లు అమ్మాలంటూ బెదిరింపులు! ఆక్రమణదారుల నుంచి తమను రక్షించాలంటూ వృద్ధ దంపతుల ఆవేదన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6090236-850-6090236-1581841720533.jpg)
తమ ఇంటిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న వారి నుంచి తమను రక్షించాలంటూ నెల్లూరులోని భక్తవత్సలనగర్కి వృద్ధ దంపతులు కలెక్టరేట్ కి వచ్చి అధికారులకు మొరపెట్టుకున్నారు. నగరంలోని భక్తవత్సలనగర్లో టీఎస్ఆర్ శర్మ, విజయ దంపతులు నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉండగా, వీరందరికీ వివాహాలై ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మత్స్య శాఖలో ఇన్ స్పెక్టర్ గా పదవీ విరమణ చేసిన శర్మకు 30 ఏళ్ల క్రితం భక్తవత్సలనగర్ దగ్గర ప్రభుత్వం 33 అంకణాల స్థలం ఇచ్చింది. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న శర్మ వద్దకు ఈనెల 5న ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇంటిని అమ్మాలని కోరారు. ఇంటిని అమ్మే ఆలోచన తనకు లేదని, పిల్లలను అడిగి ఏ విషయం చెబుతానని చెప్పినా వారు వినకుండా రూ.52 లక్షలకు ఇల్లు కొంటున్నట్లు పేపర్ల మీద బలవంతంగా సంతకాలు తీసుకున్నారని, ఐదు వేలు అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారని తెలిపారు. ఇల్లు అమ్మడం ఇష్టం లేక అడ్వాన్సు తిరిగి ఇచ్చేందుకు వెళ్లగా వారు బెదిరింపులకు దిగారని శర్మ పేర్కొన్నారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించాలని అధికారులు వారికి సూచించారు.