బోర్డుపై అక్షరాలు దిద్దిన ఆ చేతులు.. రోడ్డుపై.. తోపుడు బండిని తోస్తున్నాయి. అ, ఆ లు చెప్పిన ఆ నోరు.. అరటి పండ్లు.. అరటి పండ్లు.. అని అరుస్తోంది. గతం ఏదైనా.. ఇప్పుడు బతుకు ముఖ్యమనుకుని బడి పంతులు రోడ్డుపై అరటి పండ్లు అమ్మె పరిస్థితి. కరోనా ప్రభావానికి.. ఇలా రోడ్డుపైకి వచ్చిన ఉన్నత విద్యావంతులెందరో కదా! ఒక్కసారి ఆ బడి పంతులు వెంకటసుబ్బయ్య గురించి తెలుసుకుందాం.
నెల్లూరు నగరం వేదాయపాళెం ప్రాంతంలో వెంకటసుబ్బయ్య అనే ఉపాధ్యాయుడు ఎం.ఏ. తెలుగు, ఎం.ఏ. పొలిటికల్ సైన్స్, డీఈడీ పూర్తి చేశాడు. నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన తన కుమారుడి వైద్యం కోసం... దాదాపు మూడు లక్షల రూపాయలు అప్పు చేసినా, తనకొచ్చే జీతంతో అన్ని కట్టుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు.
ఈ క్రమంలో లాక్డౌన్ కారణంగా ఆ ఉపాధ్యాయుడి పరిస్థితి దయనీయంగా మారింది. విద్యా సంస్థలు మూతపడ్డాయి. కొంతకాలం ఆన్లైన్ ద్వారా వెంకటసుబ్బయ్యతో క్లాసులు చెప్పించారు. కొత్త విద్యార్థులను చేర్పించాలనే టార్గెట్ చేరుకోలేకపోవటంతో... ఆ విద్యాసంస్థ ఆయనను పక్కన పెట్టింది. దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్న ఆ ఉపాధ్యాయుడు... చివరకు తోపుడు బండిపై అరటిపండ్లు అమ్మటం ప్రారంభించాడు.