రాష్ట్ర ధాన్యగారంలో కరవు ఘంటికలు... నెల్లూరు జిల్లాకు రెండు కళ్లుగా పిలుచుకునే పెన్నా-స్వర్ణముఖి నదులు మూడేళ్లుగా వర్షపాతం లేక ఎండిపోయాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని రెండేళ్లుగా శ్రీశైలం నుంచి సోమశిలకు నీటితో తీసుకురావటంతో సమస్య కొంత అదుపులో ఉండేది. ఇప్పుడు వర్షాల్లేక సోమశిల ఒట్టిపోతోంది. పంట వేసిన రైతులు ఎండిపోతున్న పైరు చూసి బోరుమంటున్నారు.
తాండవిస్తున్న కరవు..
పది నియోజకవర్గాల్లోని 46 మండలాల్లో ఏ ఒక్క మండలంలోనూ చుక్క నీరు లేదు. ప్రభుత్వం మాత్రం 21 మండలాలనే కరవు మండలాలుగా గుర్తించింది. నదులు, కాలువల ద్వారా నీళ్లు రాకపోయినా బోర్లపై ఆశపెట్టుకున్న రైతన్నలకు నిరాశే ఎదురైంది.
నిద్రపోనీయని అప్పులు..
జిల్లాలో ఎక్కడా వర్షాలు లేకపోవటంతో ప్రజలు తాగునీటికే కటకటలాడుతున్నారు. ప్రతిచోట ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నా.. సరిపోవడం లేదు. ఆ ట్యాంకర్ల నీటినే కొనుగోలు చేసి చెట్లను బతికించుకుంటున్నారు కొందరు రైతులు. ఇన్ని ప్రయాసలు పడుతున్నా... నిమ్మ, మామిడి చెట్లు బతకడం లేదు. ఫలితంగా అప్పులు, వడ్డీలు కర్షకుణ్ని నిద్రపోనివ్వడం లేదు. పిల్లలనూ చదవించడం కష్టంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరవు నివారణ చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి : నీళ్లు లేక పొలాలు బీళ్లు.. బోసిపోతున్న పల్లెలు