Problems of Contract Workers: క్లీన్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా తీసుకువచ్చిన స్వచ్ఛ సంకల్ప వాహనాల డ్రైవర్లు... ఐదు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేలకు పైగా వాహనాలను కార్పొరేషన్లు, పురపాలక సంఘాలకు పంపిణీ చేసిన ప్రభుత్వం, వాటి నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు దక్కించుకున్న రాయచోటికి చెందిన రెడ్డి ఏజెన్సీ సంస్థ.. సమయానికి జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తోందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పిన వేతనానికి, తీసుకునే జీతానికి అసలు పొంతన లేదని.. పైగా అది కూడా మూడు, నాలుగు నెలలకు ఓసారి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. గుత్తేదారు సంస్థ తీరును నిరసిస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళకు దిగారు.
ఒప్పందం ప్రకారం నెలకు 10వేల 600 రూపాయలు జీతం ఇస్తామన్న గత్తేదారు సంస్థ.. తీరా విధుల్లోకి చేరాక 9 వేల270 రూపాయలు మాత్రమే ఇస్తోంది. ఇది కూడా ఒకేసారి చెల్లించకుండా.. విడతల వారీగా ఇస్తున్నారని డ్రైవర్లు ఆరోపించారు. ఈఎస్ఐ, పీఎఫ్ సైతం అమలు కావటం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం ఇచ్చే ముందు గుత్తేదారు సంస్థ ఒక్కొక్కరి నుంచి 20 వేల రూపాయలు వసూలు చేసిందని.. ఇప్పుడు జీతాలు అడిగితే పట్టించుకోవటం మండిపడుతున్నారు.
ప్రభుత్వం, అధికారులు స్పందించి సదరు గత్తేదారు సంస్థ నుంచి వేతనాలు ఇప్పించాలని .. ఈఎస్ఐ, పీఎఫ్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని డ్రైవర్లు కోరుతున్నారు.
"రాష్ట్రం మొత్తం ఇలాగే ఇబ్బందులున్నాయి. ఎవరికీ సరిగ్గా జీతాలు పడట్లేదు. కొంత మందికి 5 నెలలుగా జీతాలు రావడం లేదు. అసలు జీతం ఎంతో కూడా మాకు తెలియడం లేదు. ఒకరికి 8 వేలు వేస్తున్నారు. మరొకరికి 2 వేలు వేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 5 నెలలుగా జీతాలు అందని వాళ్లు ఉన్నారు. మేమేం జీతాలు పెంచమని అడగట్లేదు. మా జీతాలు.. మాకు ఇప్పించండి అంటున్నాము". - వెంకటేశ్వర్లు, కార్మికుడు