నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినిపట్నం గ్రామ పరిధిలోని 211 హెక్టార్లలో సిలికా శాండ్ తవ్వి, అమ్ముకునేందుకు ఈ ఏడాది జూన్‌లో టెండర్లు పిలిచారు. ఇసుక మేటలు ఉన్న ప్రాంతాన్ని 47 క్వారీలుగా విభజించినప్పటికీ, అన్నింటికి కలిపి ఒకే టెండరు పిలిచారు. ఇందులో పాల్గొనే సంస్థల వార్షిక టర్నోవర్ రూ.400 కోట్లు ఉండాలనే నిబంధన విధించారు. ఎప్పటి నుంచో సిలికా శాండ్ తవ్వకాల్లో ఉన్న ఇతర సంస్థలు, లీజుదారులు ఈ నిబంధనతో టెండరు వేయలేకపోయారు. ఏపీఎండీసీ బేసిక్ ధర టన్నుకు రూ.200గా నిర్ణయించగా.. కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ (హైదరాబాద్) రూ.202, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ ఇండియా లిమిటెడ్ (హైదరాబాద్) రూ.212 చొప్పున కోట్ చేశాయి.
బేసిక్ ధర కంటే టన్నుకు రూ.12 అదనంగా వేసిన శ్రీ అవంతికకు ఇటీవలే టెండరు ఖరారు చేశారు. గతేడాది ఇదే జిల్లా కోట మండలం కొత్తపట్నం ప్రాంతంలో 12 హెక్టార్లలో సిలికా శాండ్‌కు ఏపీఎండీసీ టెండర్లు పిలిచింది. బేసిక్ ధర రూ.150గా పేర్కొంది. నెల్లూరు జిల్లాకే చెందిన ఓ సంస్థ రూ.291 కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. ఏడాది తర్వాత ధర పెరగకపోగా, గతం కంటే రూ.79 తక్కువకు పాడుకోవడం గమనార్హం. తుమ్మినిపట్నం ప్రాంతంలో 85 లక్షల టన్నుల ఖనిజ నిల్వలున్నట్లు అంచనా. ఖరారైన టెండర్ ప్రకారం ఏపీఎండీసీకి టన్నుకు రూ.212 చొప్పున రూ.180 కోట్ల ఆదాయం వస్తుంది. అదే రూ.291 చొప్పున ధర ఉంటే మరో రూ.67 కోట్లు అదనంగా వచ్చేది.