ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2019, 11:43 PM IST

ETV Bharat / state

'రూ.100 కోట్లతో ఉదయగిరి అభివృద్ధికి ప్రణాళికలు'

ఉదయగిరి ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని... జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.

District Collector Seshagiribabu visited udagiri
ఉదయగిరి చెరువును పరిశీలిస్తున్న కలెక్టర్

'రూ.100 కోట్లతో ఉదయగిరి అభివృద్ధికి ప్రణాళికలు

నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతంలో పర్యటకాభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు... జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్​ రెడ్డితో కలసి ఉదయగిరిలో కలెక్టర్ పర్యటించారు. తొలుత స్థానిక ట్యాంకుబండ్ కూడలి వద్ద ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ట్యాంక్ బండ్ వద్ద చాలా కాలంగా నిరుపయోగంగా ఉన్న పర్యటక భవనాలను పరిశీలించారు. ఆ తరువాత ఉదయగిరి చెరువును సందర్శించి దాని అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే కలెక్టర్​కు వివరించారు.

మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చేయనున్న అభివృద్ధి పనులకు సంబంధించి కేటాయించిన భూమినీ పరిశీలించారు. అనంతరం స్థానిక స్త్రీశక్తి భవనంలో నియోజకవర్గ స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఎమ్మెల్యేతో కలసి సమీక్ష నిర్వహించారు. ఉదయగిరి ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రూ.100 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

ఇప్పటికే రూ.50 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసి నివేదిక పంపామని కలెక్టర్ చెప్పారు. మరో రూ. 50 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఉదయగిరి చెరువు అభివృద్ధికి రూ.8 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతున్నట్లు వివరించారు. ఉదయగిరిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఉదయగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కోరిక మేరకు 16 నూతన గ్రామ సచివాలయ భవనాలను మంజూరు చేస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి

కార్యకర్తల్లో క్రమశిక్షణ ఉండుంటే...జనసేన గెలిచేది: పవన్

ABOUT THE AUTHOR

...view details