నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన 660 రైతు భరోసా కేంద్రాల పరిధిలోని గ్రామాలను యూనిట్‌గా తీసుకొని... పంటల సరళిపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ సంచాలకులు ఆనంద కుమారి తెలిపారు. ఉదయగిరి వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యవాణితో కలసి... ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులతో చర్చించారు. వారి నుంచి సూచనలు, సలహాలను తెలుసుకున్నారు.
రైతులు ఏ రకమైన పంటలు సాగు చేస్తున్నారు, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, భూసారం, వర్షపాతం నమోదు, నీటి లభ్యతకు అనుగుణంగా ఏ రకమైన పంటల సాగు చేస్తే రైతుకు ఆదాయం ఉంటుందనే విషయాలపై చర్చించారు. రైతులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతీ రైతు పొలాన్ని ఖాళీగా ఉంచకుండా ఏదో ఒక రకమైన సాగు చేసేలా చైతన్యం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
మెట్ట ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ నీటితో పంట దిగుబడి వచ్చే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆసక్తిగల రైతులు ముందుకు వస్తే తక్కువ నీటితో సాగయ్యే పంటలు, ఉద్యానవన పంటల సాగుకు ఉపాధి హామీతో అనుసంధానం చేసి... ప్రయోజనం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.