ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు వైఎస్సార్​సీపీలో ముసలం.. ఆనం, కోటంరెడ్డి బాటలో మరొకరు..

Nellore politics : నెల్లూరు వైఎస్సార్​సీపీలో అసమ్మతిసెగ దావానంలా విస్తరిస్తోంది. ఇన్నాళ్లు అణిగిమణిగి ఉన్న నేతలు ఒక్కొక్కరూ గళం విప్పుతున్నారు. ఆనం, కోటంరెడ్డి బాటలోనే.. తాజాగా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అసమ్మతి స్వరం వినిపించడం పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోంది.

నెల్లూరు వైసీపీలో రాజుకున్న కుంపటి
నెల్లూరు వైసీపీలో రాజుకున్న కుంపటి

By

Published : Feb 2, 2023, 9:50 AM IST

నెల్లూరు వైసీపీలో రాజుకున్న కుంపటి

Nellore politics : నెల్లూరు వైఎస్సార్​సీపీలో రేగిన అసమ్మతిసెగ.. రోజురోజూకు దావానంలా మారుతోంది. ఇన్నాళ్లు అసంతృప్తి వెళ్లగక్కలేక అణిగిమణిగి ఉన్న నేతలు ఒక్కొక్కరూ గళం విప్పుతున్నారు. ఆనం, కోటంరెడ్డి బాటలోనే అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. తాజాగా ఉదయగిరి వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అసమ్మతి స్వరం వినిపించడం.. పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తోంది.

వైఎస్సార్​సీపీ కంచుకోట నెల్లూరు జిల్లాలో అసంతృప్తి జ్వాలలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధిష్ఠానం తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ధిక్కారస్వరం వినిపించడం.. చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ సొంత సామాజికవర్గానికి చెందిన నేతలే.. బాహాటంగా పార్టీ తీరును ఎండగడుతున్నారు. సొంతపార్టీ నేతలనే నమ్మకుండా ఫోన్‌ ట్యాంపింగ్‌లు చేయడం.. ఆయా నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను నియమించడం, పార్టీ పరిశీలకులను ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజా సమస్యలపై బహిరంగంగా మాట్లాడితే చాలు.. అధిష్ఠానం కక్షగడుతోందని వారు ఆరోపిస్తున్నారు. సీనియర్ నేత ఆనం రాంనారాయణరెడ్డి నియోజకవర్గంలో ఆయన్ను కాదని పార్టీ సమన్వయకర్తను నియమించగా.. తన ఫోన్‌ ట్యాంపింగ్ చేశారంటూ నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గళమెత్తారు. పార్టీ మారనున్నట్లు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బహిరంగంగానే చెప్పారు.

అధికార పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీ వీడే యోచనలో ఉండటంతో తర్జనభర్జన పడుతున్న అధిష్టానానికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సైతం అసమ్మతి గళం వినిపించారు. పార్టీ పరిశీలకుడు ధనుంజయరెడ్డి తనను ఇబ్బంది పెడుతున్నారని.. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆయన మండిపడ్డారు.

కార్యకర్తలు అడిగారు.. నెక్ట్స్ ఎన్నికల్లో పోటీ చేయడం ఎట్లా అని.. తెలుగుదేశంలో పోటీ చేయాలని ఆలోచన ఉంది.. కానీ, నిర్ణయించాల్సి ఉంది అని చెప్పిన.. అది భవిష్యత్ లో మాట్లాడుకుందాం.. ముందు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏందో చూడండి అని చెప్పా..- కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎమ్మెల్యే

రాజ్యాంగేతర శక్తులు వచ్చి అధికారులను మార్చేశాం.. కమిషనర్లను మారుస్తాం.. పోలీసుల్ని మారుస్తాం.. లేదా ఎమ్మార్వోలను తీసేస్తాం.. ఎంపీడీవోలని తీసేస్తాం.. ఉన్న రాజ్యాంగ బద్ధమైన శాసన సభ్యుడికి పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వం.. ఉన్న సెక్యూరిటీని తగ్గించేస్తాం.. ఇటువంటి ఆలోచన చేసే రాజ్యాంగేతర శక్తులు ఏ రకమైన పరిపాలనా దక్షతను ప్రదర్శించగలరు.- ఆనం రాంనారాయణరెడ్డి, ఎమ్మెల్యే

మాకొక పెద్దని ఉదయగిరికి ధనుంజయరెడ్డిని పరిశీలకుడిగా వేశారు. నియోజకవర్గంలో వివాదాలను పరిష్కరించడమే పరిశీలకుడి పని. నాకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులను ప్రోత్సహిస్తున్నడు. ఈయనయన్నీ వక్రపు పనులే.. జీకే తెలియని వ్యక్తి మామీద పెత్తనం చెలాయించాలంటే కుదరదు. - మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే

జిల్లాలో మరికొందరు వైఎస్సార్​సీపీ ప్రజాప్రతినిధుల తీరుతో పార్టీ అధిష్టానానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details