Demolition Of House : గత 40 సంవత్సరాలుగా వాళ్లు అక్కడే జీవిస్తున్నారు.. కూలీ, నాలీ చేసి.. కడుపు మాడ్చుకుని.. రూపాయి రూపాయి కూడబెట్టుకుని వాళ్లు ఇళ్లు కట్టుకున్నారు. కానీ అధికార పార్టీ నాయకుడు తన అనుచరుడి కోసం రాత్రికి రాత్రే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఇళ్లను నేలమట్టం చేయించాడు. వాళ్లందరూ మేము ఈ ఆర్ధరాత్రి ఎక్కడికి పోవాలని లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఈ తతంగం అంతా నెల్లూరు జిల్లాలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కనుసన్నలలో జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
నెల్లూరులో అర్ధరాత్రి నాలుగు ఇళ్లను కూల్చి వేశారు. ఈ సంఘటన జిల్లాలో తీవ్ర విమర్శలకు దారి తీసింది. రాముర్తినగర్లో 40 ఏళ్లుగా ఉంటున్నామని,.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనుచరుడి కోసం తమ ఇల్లు కూల్చి వేశారని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 40 ఏళ్లుగా ఉంటున్న ఇళ్లకు ప్రతి సంవత్సరం ఇంటి పన్ను కూడా కార్పొరేషన్‌కు చెల్లిస్తున్నామని, అర్ధరాత్రి అధికారుల అండతో ప్రొక్లెయినర్‌తో కూల్చి వేశారని, దీంతో రోడ్డున పడ్డామని నాలుగు కుటుంబాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కోల్పోవడం వల్ల వృద్దులు, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడి కోసం తమ ఇళ్లు కూల్చి వేశారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. బాధితులకు టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, మహిళా సంఘాలు నాయకులు అండగా నిలిచారు.