నెల్లూరు జిల్లా నాయుడుపేటలోపుర ఎన్నికలకు సంబంధించి.. నామినేషన్ల ఉప సంహరణ గడువు దగ్గరపడుతుండటంతో మూడు పట్టణాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకుల్లో తర్జన భర్జనలు మొదలయ్యాయి. త్వరలో తిరుపతి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ముందుగా పట్టణాల్లో రాజకీయ పార్టీల గుర్తులతో జరిగే పుర ఎన్నికలు పార్టీలు, నాయకులకు ప్రతిష్ఠాత్మకమవుతున్నాయి.
గూడూరు, నాయుడుపేట డివిజన్లలో నాయుడుపేట, వెంకటగిరి, సూళ్లూరుపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా- గత ఏడాది నామినేషన్ల ఉపసంహరణ దశలో ప్రక్రియ వాయిదా పడింది. ఏడాది తర్వాత మళ్లీ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో నిన్నటి వరకు పంచాయతీ ఎన్నికలపై దృష్టి పెట్టి ఉన్న నాయకులు.. ఇప్పుడు పట్టణాల్లో కౌన్సిలరు స్థానాలపై ప్రత్యేక దృష్టించారు. ఛైర్మన్ పదవులను దక్కించుకునేందుకు ఇప్పటికే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. కౌన్సిలర్ స్థానాలకు అధికార పక్షం నుంచి ఎక్కువ మంది నామినేషన్లు వేశారు. ఉపసంహరణ నాటికి వీరందరితో మంతనాలు జరిపి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో నాయుడుపేట, సూళ్లూరుపేటలో ఇప్పటికే అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండేలా చర్యలు చేపట్టారు. విజయవకాశాలు ఉన్న అభ్యర్థులనే బరిలో నిలిపేందుకు గత రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అధికారపక్షానికి దీటుగా ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీలోని ముఖ్య నాయకులను ఇన్‌ఛార్జులుగా నియమించి.. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో మనోధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే నాయుడుపేట పట్టణంలో తెదేపా ముఖ్య నాయకులు ఎన్నికల వ్యూహంపై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చి అభ్యర్థులతో చర్చించారు. భాజపా నాయకులు కూడా మూడు పట్టణాల్లో కొన్ని కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. పుర ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకునేందుకు యత్నిస్తున్నారు. నాయుడుపేట, సూళ్లూరుపేట, వెంకటగిరి పురపాలక సంఘాల్లో 2014లో జరిగిన ఎన్నికల్లో ఛైర్‌పర్సన్ స్థానాలను తెదేపా కైవసం చేసుకుంది. మళ్లీ వీటిని పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తుండగా... ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేల ఆధిపత్యం ఉండటంతో... వీరు తమ పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నారు.