Cyclone Michaung Effect in Nellore District: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో తుపాను ప్రభావంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాలో చాలాచోట్ల 10 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మనుబోలులో 36.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులోని గిరిజన కాలనీ చుట్టూ నీరు చేరడంతో స్పందించిన ఆత్మకూరు ఆర్డీఓ వెంటనే జేసీబీ సహాయంతో నీటిని బయటకు తోడించే పనులు చేపట్టారు.
మర్రిపాడు మండలం పడమటినాయుడుపల్లి వద్ద కేతా మన్నేరు వాగు, ఎస్.పేట మండలం తెల్లపాడు వద్ద ప్రధాన రహదారిపై అలుగు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చాయి. పెన్నా పరివాహకమైన అనంతసాగరం ఆత్మకూరు సంఘం చేజెర్ల మండలం పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
ఈదురు గాలులకు స్తంభాలు నేలకొరగడంతో నిన్నటి నుంచి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సంగం వద్ద జాతీయ రహదారిపై కొండ నుంచి రాళ్లు రోడ్డు మీదకు పడుతుండడంతో ప్రమాదం పొంచి ఉందని పరిసర లోతట్టు ప్రాంతాల్లోని గిరిజనులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఉత్తర దిశగా కదులుతున్న తీవ్రతుపాను - కొంతభాగం సముద్రంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడి
ఉదయగిరి నియోజకవర్గంలో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. వరికుంటపాడులో వీస్తున్న గాలులకు ఓ ఇంటిపై చెట్టు విరిగిపడగా.. తుపాను ప్రభావంతో కారంచెరువులో పాడుబడిన పాఠశాల భవనం కుప్పకూలింది. దుత్తలూరు మండలంలో బ్రహ్మేశ్వరం వద్ద కల్వర్టు తెగిపడటంతో నెల్లూరు, కావలి, పామూరు వరుకు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.