Cyclone Mandaus: తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ మైపాడు తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 50 మీటర్లకు పైగా ముందుకురావడంతో..అలలు బీచ్ వద్ద దుకాణాలను తాకుతున్నాయి. పెన్నా పరివాహక ప్రాంతాలైన అనంతసాగరం, చేజర్ల, ఆత్మకూరు, సంగం మండలాల అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు.
తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న తీర ప్రాంతాల్లో.. షల్టర్‌లలో వసతులు ఏర్పాటు చేశారు. జిల్లాకు ఒక ఎస్డీఆర్ఎప్, రెండు ఎన్డీఆర్ఎప్ బృందాలు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా సోమశిల జలాశయం నుంచి పెన్నా నదిలోకి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. తీర ప్రాంతంలోని 11మండలాల్లో రెవిన్యూ, పోలీసు అధికారులతో బృందాలు ఏర్పాటు చేశారు.
అతలాకుతలం అవుతోన్న దక్షిణకోస్తా, రాయలసీమ తుపాను ప్రభావంతో అల్లూరి జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాల కారణంగా ధాన్యం పాడవుతుందని రైతులు దిగులు చెందుతున్నారు. కడపలో సాయంత్రం ఐదు గంటల నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. తుపాను దృష్ట్యా.. చెరువులు, కాలువల వద్ద నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
మాండౌస్ తుపాను తిరుమలలో తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొండపై చలి తీవ్రత అధికంగా ఉండటంతో వృద్దులు, పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. తుపాను మహాబలిపురం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో 65నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.
ఇవీ చదవండి: