CROP LOSS DUE TO MANDOUS : కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో.. తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ''ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి'' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.. తుపాను కారణంగా తడిసిన పొలాలను, ధాన్యాన్ని పరిశీలించారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కోడూరు మండలం విశ్వనాథపల్లి, నారేపాలెం, గాబ, పిట్టలంక గ్రామాల్లో.. మాండౌస్ తుపాను కారణంగా దెబ్బతిన్న పొలాలు, వాటికి అనుసంధానంగా ఉన్న డ్రైనేజీలను మాజీ సభాపతి మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు.
80శాతం రాయితీపై విత్తనాలు అందించాలి:డ్రైనేజీల తవ్వకాలకు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని బుద్ధప్రసాద్ అన్నారు. ప్రభుత్వం వెంటనే 80 శాతం రాయితీపై విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు. పెనమలూరు నియోజకవర్గం మద్దూరులో రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులను.. తెలుగుదేశం నేత బోడె ప్రసాద్ పరిశీలించారు. R.B.K.ల్లో ధాన్యం కొనుగోళ్లలో వ్యత్యాసం చూపుతున్నారని రైతులు ఆరోపించారు. ఆరబెట్టిన ధాన్యం రాశులను వెంటనే సేకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాత మాజేరులో.. వర్షాలకు మునిగిపోయిన వరి పొలాలను.. అవనిగడ్డ MLA సింహాద్రి రమేశ్‌బాబు, కలెక్టర్ రంజిత్ బాషా పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. డ్రైనేజీల్లో పూడిక తీయకపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు మొర పెట్టుకున్నారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఉచితంగా విత్తనాలు అందజేసి రైతులను ఆదుకోవాలి:గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో.. తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడంతోపాటు.. ఉచితంగా విత్తనాలు అందజేసి ఆదుకోవాలని కోరారు. వర్షాలకు తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలో.. దెబ్బతిన్న పొలాలను ఆయన పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని... రెండో పంట వేసుకునేందుకు రాయితీపై విత్తనాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు..