నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో అగ్నిప్రమాదం(NELLORE FIRE ACCIDENT) సంభవించింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకై భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
gas leak: ఇంట్లో గ్యాస్ లీకై... ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి - నెల్లూరులో భారీ పేలుడు
09:12 November 22
దంపతులతో పాటు అగ్నికి ఆహుతైన చిన్నారి
అబ్యాస్, నౌషాద్ భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. వీరు ఇంట్లోనే టిఫిన్లు చేసి.. గ్రామంలో అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజూలాగానే ఈరోజు కూడా వంట చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పటికే గ్యాస్ లీకైన విషయం గుర్తించిన దంపతులు... గ్యాస్ వెలిగిండంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ... మంటలు ఇళ్లంతా వ్యాపించాయి. ఈ ఘటనలో భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. చిన్నారి అయేషా తీవ్ర గాయాలపాలైంది.
విషయం గుర్తించిన స్థానికులు వచ్చి తలుపులు తెరిచారు. వెంటనే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలాగే అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన 108 సిబ్బంది... చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ అయేషా ఆసుపత్రిలోనే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదసమయంలో భార్యాభర్తలతో పాటు చిన్న కూతురు మాత్రమే ఇంట్లో ఉంది. మిగిలిన ఇద్దరూ బంధువుల ఇంటికి వెళ్లడంతో వారి ప్రాణాలు నిలిచాయి. కానీ తల్లిదండ్రులతో పాటు తమ చిన్నారి చెల్లి మృతిని జీర్ణించుకులోనే బాలికలు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీ చూడండి:FIRE ACCIDENT: గ్యాస్ లీక్.. పెన్నా సిమెంట్ పరిశ్రమలో అగ్నిప్రమాదం