ఆన్ లైన్ చదువుల పేరుతో విద్యార్థుల నుంచి కార్పొరేట్ కళాశాలలు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో అంతర్జాలంలో చదువు చెప్తామంటూ వేలకు వేలు దండుకుంటున్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 204 ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2020-21 విద్యా సంవత్సరానికి 25,590 మంది ద్వితీయ సంవత్సరం చదవనున్నారు. జూనియర్ కళాశాలల్లో హెచ్‌ఈసీ, కామర్స్, సైన్సు కోర్సులు నిర్వహిస్తుండగా కార్పొరేట్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ తరగతులు మాత్రమే కొనసాగిస్తున్నారు. జిల్లాలో 14,582 మంది ఎంపీసీ, 11,008 మంది బైపీసీ విద్యార్థులు చదువుతున్నారు.
వీరికి ఆయా యాజమాన్యాలు అంతర్జాల పాఠాల బోధన పేరుతో వల వేస్తున్నాయి. ఆన్‌లైన్ తరగతులను ప్రతిరోజూ 2 సెషన్‌లలో చేపడుతున్నారు. మార్చి నెలలో కళాశాలల నిర్వాహకులు మొదటి 15 రోజులు ఉచితంగా అందించినా ఏప్రిల్ నుంచి తల్లిదండ్రుల వద్ద ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో విద్యార్థి నుంచి రూ.15 వేల వరకు తీసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి మొదలవుతుందో తెలియదు. ఒక వేళ తరగతులు నిర్వహిస్తారా? లేదా? లాంటి సమస్యలతో తల్లింద్రులు ఒత్తిడికి గురవుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో పేద, మధ్యతరగతి కుంటుంబాలకు ఉపాధి లేక ఆర్థికంగా కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమైన తరుణంలో ఫీజులు అదనపు భారమవుతున్నాయి.
అంతర్జాలంలో బోధన
జిల్లాలో కరోనా నియంత్రణ చర్యలను అధికారులు కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని జూనియర్ కళాశాలలు వాట్సాప్‌లలో విద్యార్థులకు పాఠాలు బోధించే నూతన సంస్కృతిని ఆరంభించాయి. నిత్యం ఉదయాన్నే అధ్యాపకులు విద్యార్థులకు వాట్సాప్‌లలో హోంవర్క్ ఇవ్వడం.. ఆపైన అంతర్జాలం ద్వారా పాఠ్యాంశాలను విద్యార్థులకు చెప్పేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్ తరగతులకు దూరంగా ఉంటే సబ్జెక్టులో తమ మిత్రుల కన్నా వెనకబడతామేమోనని విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరు తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించి విడతల వారీగా నగదు చెల్లిస్తామని బతిమాలినా యాజమాన్యాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. ప్రత్యేక తరగతుల పేరుతో రూ.వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసినా అధికారులు కళాశాలల వైపు చూడటం లేదు.