రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లాలో సుమారు 50వేల ఎకరాల్లో నిమ్మ సాగవుతోంది. ఎకరాకి 70వేల నుంచి లక్ష రూపాయల వరకూ రైతులు పెట్టుబడి పెడుతున్నారు. ఏటా జూన్ నుంచి వచ్చే నిమ్మకాయలకు ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే రైతులు అప్పులు చేసి మరీ నిమ్మతోటను కాపాడుకుంటారు. గత ఏడాది 80కేజీల నిమ్మకాయల బస్తా 12 వేల రూపాయలకు పైగా ధర పలికింది. ప్రస్తుతం అదే బస్తా 3 వందలకు మించడం లేదు. జిల్లాలోని పొదలకూరు, గూడూరులో అంతరాష్ట్ర స్థాయి మార్కెట్లు ఉన్నాయి. కరోనా ప్రభావంతో ఈ మార్కెట్లు మూతపడ్డాయి. చెట్లనిండా కాయలు ఉన్నా కొనే వారు లేక రైతులు తోటల్లోనే వదిలేస్తున్నారు. కాయలు పండి చెట్లకిందనే ఎండిపోతున్నాయి.
బస్తా నిమ్మకాయలు కోతకూలి 250 రూపాయలు అవుతుండగా....రవాణా ఛార్జీలు 100రూపాయలు వరకు అవుతున్నాయి. తీరా మార్కెట్‌కు వెళ్లిన తర్వాత...బస్తా ధర 300 వందలకు మించి పలకడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యయప్రయాసలు ఓర్చి నిమ్మకాయలు మార్కెట్‌కు తీసుకొచ్చినా....కూలీ ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోయంబేడు మార్కెట్ ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువైనందున మార్కెట్లు తెరిచేందుకు అధికారులు భయపడుతున్నారు. దిల్లీ, ఆగ్రా, చెన్నై మార్కెట్లు మూతపడ్డాయని.... కొనే వారు లేకే స్థానిక మార్కెట్లనూ మూసేసినట్లు చెబుతున్నారు.