నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ ఫలితాలు వెల్లడైన ప్రతిసారీ బాధితులను గుర్తించడం అధికారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యంతో ఇక్కడ ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతోంది. లోతుగాచూస్తే, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మొత్తం ఆ అంశంపైనే దృష్టి పెట్టి పనిచేస్తోంది. ఓ దశలో వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి మరీ ఈ విపత్తును ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో అధికారికి ఒక్కో రకమైన విధులను అప్పగించారు. కొందరు క్వారంటైన్ సెంటర్లు పర్యవేక్షిస్తూ ఉండగా.. మరికొందరు బాధితుల గుర్తింపు చేపడుతున్నారు. ఇంకొందరు కేంద్రాలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. కరోనా అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ కేంద్రాలకు పంపించి త్రోట్ స్వాబ్, రక్తనమూనాలు సేకరించి తిరుపతి స్విమ్స్‌కు పంపిస్తున్నారు. అక్కడ పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా పాజిటివ్ కేసుల గుర్తింపు జరుగుతోంది. అయితే ఇక్కడే సమస్య ఏర్పడింది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో కరోనా అనుమానితులను క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్న అధికారులు.. వారి త్రోట్‌స్వాబ్ సేకరించి పరీక్షలకు పంపిస్తున్నారు. అయితే, ఇక్కడే నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండటం గమనార్హం. ప్రతి క్వారంటైన్ కేంద్రంలోనూ అనుమానితుడి నుంచి నమూనా సేకరించినప్పుడు దానికి ఆ వ్యక్తి వివరాలు జోడించి పక్కాగా నమోదు చేసుకోవడం విధి. ఆ నమూనాకు ఇచ్చే ప్రత్యేక కోడ్‌ను రిజిస్టర్ లేదా కంప్యూటర్‌లో ఎంటర్ చేసుకోవడంతో పాటు.. ఆ వ్యక్తి పేరు, చిరునామాతో పాటు ఫోన్‌నంబరు, ఆధార్‌కార్డు నంబరు, ఫొటో తదితరాలు పొందుపరిస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు సరైన సమాచారం ఇవ్వడానికి మొగ్గుచూపని క్రమంలో ఆధార్‌కార్డు నంబరు అధికారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. స్విమ్స్ అధికారులు నమూనా సంఖ్య వారీగా ఫలితాలు వెల్లడించిన అనంతరం.. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కోడ్ ఆధారంగా జిల్లా అధికారులు పరిశీలిస్తే క్షణాల్లో వారిని గుర్తించవచ్ఛు మొక్కుబడిగా వివరాలు తీసుకుని నమూనాలు పంపించేస్తుండగా.. ఫలితాలు వెల్లడైన అనంతరం వ్యక్తుల వివరాల కోసం పాట్లు పడాల్సి వస్తోంది.