చెరువులను పరిశీలించిన కలెక్టర్ - nellore collector visited bhuchireddy palem
నెల్లూరు జిల్లాలో రెండో పంట అదనపు ఆయకట్టుకు నీరు ఇవ్వాలన్న రైతుల విజ్ఞప్తులపై ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ శేషగిరిబాబు ప్రకటించారు.
నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం, రామన్నచెరువు ప్రాంతాల్లో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ శేషగిరిబాబు పర్యటించారు. జిల్లాలో పెన్నా డెల్డా కింద 1.80లక్షల ఎకరాలకు, సోమశిల కాలువ కింద 67,500 ఎకరాలకు 27.5 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఐ.ఏ.బి.లో నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. నీటి విడుదలకు సంబంధించి భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, అగ్రికల్చర్ శాఖల అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. సాగు, తాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి కేటాయింపులు చేపట్టామని వివరించారు. రెండో పంటకు నీటి విడుదలకు సంబంధించి కొన్ని ప్రాంతాల రైతుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని, వాటిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని పాలనాధికారి తెలిపారు.