ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అమ్మఒడి' పేద విద్యార్థులకు శ్రీరామరక్ష: సీఎం జగన్ - నెల్లూరులో అమ్మఒడి పథకం న్యూస్

అమ్మఒడి పథకం కింద వచ్చే ఏడాది నుంచి డబ్బులకు బదులు ల్యాప్ టాప్‌లు తీసుకొనే అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. అమ్మఒడి పథకంలో భాగంగా రెండో విడత చెల్లింపులను ఆయన నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు. ఇన్ని సంక్షేమ పథకాల అమలును ఓర్వలేక ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. అందులో భాగంగానే ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు.

CM JAGAN STARTS SECOND PAYMENT OF AMMAVODI SCHEME
'అమ్మఒడి' పథకం పేద విద్యార్థులకు శ్రీరామరక్ష

By

Published : Jan 11, 2021, 6:57 PM IST

Updated : Jan 12, 2021, 4:11 AM IST

‘ప్రతి బిడ్డకు అమ్మఒడి శ్రీరామరక్ష. చదివించే స్థోమత లేక పిల్లలను కూలీ పనులకు పంపించే పరిస్థితులను పాదయాత్రలో చూశా. అందుకే ఇప్పుడు బిడ్డలను బడికి పంపే తల్లిదండ్రులకు రూ.15 వేలు సాయం అందిస్తున్నా. వరుసగా రెండో ఏడాదీ ఈ పథకం అమలు చేశాం. ఈ ఏడాది 44.48 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,773 కోట్లు ఇచ్చాం. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరింది. వచ్చే ఏడాది నుంచి 9 నుంచి 12వ తరగతి చదివే, విద్యావసతి పొందే విద్యార్థులు అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌ అందిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని శ్రీవేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో సోమవారం జరిగిన సభలో జగనన్న అమ్మఒడి రెండో ఏడాది చెల్లింపులను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ తరగతులకు పేదింటి పిల్లలు దూరమయ్యారన్నారని, ఆ పరిస్థితులను మార్చాలనే ల్యాప్‌టాప్‌ ఇస్తున్నామన్నారు. మార్కెట్‌లో రూ.25-27 వేల మధ్య దొరికే ల్యాప్‌టాప్‌ను ప్రభుత్వ చర్చలతో కొన్ని సంస్థలు రూ.18,500కే ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయన్నారు. టెండర్లు పిలిచి, రివర్స్‌ టెండరు ద్వారా 4జీబీ ర్యామ్‌, 500 జీబీ స్టోరేజీ, విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ స్పెసిఫికేషన్‌తో ఇస్తామని తెలిపారు. వాటికి మూడేళ్లపాటు వారంటీ, పనిచేయకపోతే ఏడు రోజుల్లోనే మరమ్మతులు చేసి ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు వివరించారు.

బడిలో మరుగుదొడ్ల నిర్వహణకు...
బడికెళ్లే ఆడపిల్లలు, ఉపాధ్యాయినుల కోసం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. వాటి నిర్వహణకు అమ్మఒడి కింద ఇచ్చే రూ.15 వేల నుంచి రూ.వెయ్యి కేటాయిస్తున్నట్లు చెప్పారు. పిల్లల చదువుపై 19 నెలల్లో రూ.24 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వానికి.. ఆ వెయ్యి వ్యయం చేయడం పెద్ద భారం కాదన్నారు. మరుగుదొడ్ల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ప్రశ్నించేతత్వం పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో మరుగుదొడ్ల నిర్వహణ నిధి ఉంటుందని, నిర్వహణ సరిగా లేకుంటే 1902కు ఫోన్‌ చేస్తే సీఎంవోనే రంగంలోకి దిగుతుందన్నారు.


ప్రతి పల్లెకు అంతర్జాలం
రాబోయే తరాన్ని పోటీ ప్రపంచంలో నిలిపేలా.. వచ్చే మూడేళ్లలో ప్రతి గ్రామానికి అంతర్జాల సేవలు అందిస్తామని సీఎం చెప్పారు. అందుకోసం భూగర్భ కేబుల్స్‌ వేయడానికి రూ.5,900 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 55,607 అంగన్‌వాడీ కేంద్రాలను వైఎస్సార్‌ ప్రీప్రైమరీ 1, 2.. ప్రీ ఫస్ట్‌ క్లాస్‌ స్కూళ్లుగా మార్చి, ఆంగ్ల బోధనతో శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసిందని జగన్‌ విమర్శించారు. అక్టోబర్‌ వరకూ పాఠ్యపుస్తకాలే ఇవ్వకపోవడం, నాణ్యత లేని మధ్యాహ్నభోజనం, శుభ్రత లేని మరుగుదొడ్లు ఉండేవన్నారు. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 25% కన్నా తక్కువ సీట్లు గెలిస్తే పార్టీని మూసుకుంటావా? అని చంద్రబాబుకు సవాలు విసిరారు. ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ అడ్డంకులు సృష్టించినా అమ్మఒడి రెండోవిడత చెల్లింపులు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసులురెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, ఎంపీలు,ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.


ప్రతిపక్షాలకు కడుపుమంట
రాష్ట్రాభివృద్ధిని చూసి తమకు ఇక్కడ చోటు లేదని ప్రతిపక్షాల్లో కడుపుమంట కనిపిస్తోందని సీఎం అన్నారు. దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తూ.. ఆ తర్వాత ఆలయాల సందర్శన అంటున్నారని మండిపడ్డారు. రథాలు తగలబెట్టి రథయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దేవుడిపై భక్తి లేని వారు, ఆలయాల భూములు కాజేసినవారు, గుళ్లలో క్షుద్రపూజలు చేసినవారు ఇప్పుడు దేవుడిపై ప్రేమ ఉన్నట్లు నాటకాలాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు, ఆయన కుమారుడు హైదరాబాద్‌లో కూర్చుని, సామాన్యుల ప్రాణాలకు రక్షణ లేకుండా ఎన్నికలు నిర్వహించాలంటున్నారని విమర్శించారు. ఎన్నికలు నిర్వహిస్తామని బాబు గారి కోవర్టులు నోటిఫికేషన్‌ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. గుడుల్లో విగ్రహాలు పగలగొట్టే వ్యక్తులు రేపు బడుల మీద పడతారేమో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ఇకపై 9 నుంచి 12వ తరగతి చదివే, విద్యావసతి పొందే విద్యార్థులు అమ్మఒడి డబ్బు వద్దనుకుంటే ల్యాప్‌టాప్‌ అందిస్తాం. కొవిడ్‌ సమయంలో ఆన్‌లైన్‌ తరగతులకు పేదింటి పిల్లలు దూరమయ్యారు. ఆ పరిస్థితులు మార్చాలనే ల్యాప్‌టాప్‌ ఇస్తున్నాం.- ముఖ్యమంత్రి జగన్‌

వారి తలరాత మార్చేలా..

రాష్ట్రంలో ప్రతి పేదబిడ్డ తలరాత మార్చే దిశగా.. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని జగన్‌ చెప్పారు. అమ్మఒడి ద్వారా ఈ ఏడాది మరో 2 లక్షల మంది తల్లులకు అదనంగా ప్రయోజనం చేకూరిందన్నారు. ప్రభుత్వ బడుల్లో 4లక్షల మంది విద్యార్థులు పెరిగినట్లు వెల్లడించారు. అమ్మఒడికి రూ.13 వేల కోట్లు, జగనన్న విద్యాదీవెనకు రూ.4,100 కోట్లు, జగనన్న వసతిదీవెనకు రూ.1221 కోట్లు, సంపూర్ణపోషణ కింద రూ.1863 కోట్లు, విద్యాకానుకకు రూ.648 కోట్లు, గోరుముద్ద కోసం రూ.1456 కోట్లు, నాడు-నేడు కోసం మొదటి విడతలో రూ.2600 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. పిల్లలు ఒక్క రోజు బడికి రాకున్నా.. వెంటనే వారి తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు సమాచారం అందిస్తామన్నారు. రెండు రోజులు రాకుంటే మూడోరోజు వాలంటీరు విద్యార్థుల ఇంటికెళ్లి యోగక్షేమాలు విచారిస్తారన్నారు.

ఇదీచదవండి

ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదు: హైకోర్టు

Last Updated : Jan 12, 2021, 4:11 AM IST

ABOUT THE AUTHOR

...view details