CM Jagan tour in flood affected areas: తిరుపతి శ్రీకృష్ణనగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటించారు. వరదకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. పంటలు, పశువులను నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందరూ ధైర్యంగా ఉండాలని.. తాను అండగా ఉంటానని జగన్ వారికి భరోసా ఇచ్చారు. అంతకుముందు ఫొటో ప్రదర్శనను సీఎం తిలకించారు. నగరంలో వరద సృష్టించిన విలయాన్ని ఫొటో ప్రదర్శన ద్వారా అధికారులు జగన్‌కు వివరించారు. తిరుపతి పాడిపేటలో స్వర్ణముఖి నది వంతెనను సీఎం పరిశీలించారు. వంతెన కోతకు గురైన కారణాలను అధికారులు సీఎంకు వివరించారు.
వరదల సమయంలో స్వర్ణముఖి నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న 30 మందిని కాపాడిన వారిని ముఖ్యమంత్రి జగన్ సన్మానించారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా తిరుచానూరు సమీపంలో కొట్టుకుపోయిన వంతెనను సీఎం పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా వరదల వల్ల జరిగిన నష్టం, దెబ్బతిన్న పంటలు, వంతెనల వివరాలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాలను తిలకించారు. సంబంధిత శాఖల అధికారులు శాఖల వారీగా జరిగిన నష్టం వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం రేణిగుంట విమానశ్రయానికి చేరుకొని నెల్లూరు బయలుదేరారు..
10రోజుల్లో పీఆర్సీ..
CM Jagan tour in Tirupati: తిరుపతి శ్రీకృష్ణనగర్‌లో సీఎం ఎదుట ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శించారు. పీఆర్సీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తంచేసిన ఉద్యోగులతో సీఎం జగన్ మాట్లాడారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని.. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తెలిపారు.
నెల్లూరులో జగన్ పర్యటన..
CM Jagan tour in nellore: తిరుపతిలో పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. రోడ్డు మార్గంలో నెల్లూరు రూరల్, కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో పర్యటించారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలతో పాటు దెబ్బతిన్న రోడ్లు, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ముందుగా నెల్లూరు రూరల్ మండలంలోని దేవరపాళెం వెళ్లారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రికి వరదల నష్టాన్ని వివరించారు. అక్కడే నిర్వహించిన ఫోటో ఎగ్జిబిషన్‌లోని ప్రతీ ఫోటోకు సంభందించి సీఎంకు వివరించారు. అనంతరం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేశారు. వరదలకు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని.. ఆయా పనులు శాశ్వత ప్రాతిపదికన చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.