నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నీటి మళ్లింపు ద్వారా మెట్ట ప్రాంతాలకు వరప్రసాదినిగా రూపొందించిన ఆనం సంజీవరెడ్డి హైలెవల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ 2 పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. సోమశిల హై లెవెల్ లిప్ట్ ఫేజ్ 2 పనుల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. ఫేజ్ 2 ద్వారా ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గంలో మర్రిపాడు, ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు మండలంలోని మొత్తం 46,453 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందజేసేందుకు రూపకల్పన చేశారు.
ఈ సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ 1, 2 పూర్తి అయితే మొత్తం 90 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఫేజ్ 1లో ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి కాగా, ఇవాళ ఫేజ్ 2 పనులకు శ్రీకారం చుట్టారు. ఫేజ్ 1 పనుల అంచనా రూ.853.8 కోట్లు కాగా, మొత్తం 5 పంప్ హౌస్‌లు, నాలుగు రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. పంపు హౌస్ పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. రిజర్వాయర్ పనులు 60 శాతం పూర్తి అయ్యాయి. ఫేజ్ 2లో పని మొత్తం అంచనా రూ.648.98 కోట్లు కాగా ఒక పంపు హౌస్, రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు.
ఫేజ్ 1, 2 నిర్మాణంలో మొత్తం 80 కిలోమీటర్ల కాలువ పొడవు, ఆరు రిజర్వాయర్ల నిర్మాణం ఉండగా వీటి నిర్మాణం మొత్తం ఎనిమిది వేల ఎకరాలను ఉపయోగించుకునే విధంగా రూపొందించారు. ఈ రెండు ఫేజ్‌ల నిర్మాణం పూర్తి అయితే ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల మెట్ట ప్రాంతాలలోని ఆరు మండలాలకు సంబంధించి 90 వేల ఎకరాలకు సాగు, తాగునీటి అవసరాలు తీరనున్నాయి.
కృష్ణాపురం వద్ద నిర్మించిన పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పాల్గొన్నారు. తన తండ్రి ఎప్పటినుంచో కలలు గన్న సోమశిల జలాలు మెట్ట ప్రాంతాలకు తరలింపు నెరవేరడం చాలా సంతోషంగా ఉందని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. ఈ పనులు పూర్తయితే మర్రిపాడు, ఉదయగిరి, కావలి బీడు భూములు సస్యశ్యామలంగా మారుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పథకాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, రైతుల మేలు కోసం పాటు పడుతుందని మంత్రులు అన్నారు.
ఇదీ చదవండి :హనీష్...ఫైన్ ఆర్ట్స్ ఫొటోగ్రఫీలో అదుర్స్