రామాయపట్నం పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మొండివారిపాలెంలో పోర్టుకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల ప్రారంభించి, పైలాన్ ఆవిష్కరించారు. ఆ తర్వాత సముద్రుడికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. 3 వేల 736.14 కోట్లతో చేపడుతున్న తొలిదశ పనులు.. 36 నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు నిర్మించనుంది. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం తొలిదశలో నాలుగు బెర్తులు నిర్మిస్తారు.
ఈ పోర్ట్ ద్వారా ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తులు నిర్మిస్తారు. రాష్ట్రంలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలతోపాటు... తెలంగాణలోని నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు, హైదరాబాద్ నగరానికి పారిశ్రామిక, వాణిజ్య, రవాణా సేవల్లో రామాయపట్నం పోర్టు కీలకం కానుంది. పోర్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలు ప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు అందనున్నాయి. రామాయపట్నంతోపాటు మచిలీపట్నం, భావనపాడు పోర్టులు పూర్తిచేయడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.