chandrababu phone to karunakar family: నెల్లూరు జిల్లాలో కావలిలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన దళిత యువకుడు దుగ్గిరాల కరుణాకర్ కుటుంబ సభ్యులతో తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. కరుణాకర్ మృతితో రోడ్డున పడి, తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు. కరుణాకర్ మృతికి వైకాపా నేతల వేధింపులే కారణమని.., కారకులకు శిక్షపడేవరకు తెలుగుదేశం పోరాటం చేస్తుందని చెప్పారు. నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని అన్నారు. పిల్లల చదువు, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చావుకు కారకులు ఎవరో చెపుతూ కరుణాకర్ లేఖ ద్వారా స్పష్టంగా తెలిపినా.. కనీసం ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయ్యకపోవటాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు.
ఏం జరిగిందంటే..: వైకాపా నేతల వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఓ దళిత యువకుడు శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.20 లక్షలు అప్పు చేసి చెరువులో చేపలు పెంచితే, వాటిని పట్టుకోకుండా అడ్డుపడుతున్నారని, తనతోపాటు తన తల్లినీ వేధించారని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. కావలి పట్టణం ముసునూరు ఎస్సీకాలనీకి చెందిన దుగ్గిరాల కరుణాకర్(36) చేపల చెరువును సబ్ లీజుకు తీసుకొని మత్స్య వృత్తితో జీవనం సాగిస్తున్నారు. రెండేళ్లుగా వరదలు, వర్షాల కారణంగా చేపలు కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.