తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో రోడ్‌షోలో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.
‘25 మంది ఎంపీలను గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తానని చెబితే.. ప్రజలు నమ్మారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్కసారైనా ఆ ప్రస్తావన తెచ్చారా? ప్రత్యేక హోదాను ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు మీరు తిరుపతి వేదికగా చెప్పాలి. తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా గెలిస్తే.. నేనేమీ ముఖ్యమంత్రిని కాను. పనబాక లక్ష్మిని గెలిపిస్తే.. మా ప్రభుత్వం అధికారంలోకి రాదు. ముగ్గురికి మరొకరు తోడవుతారు. కానీ, నేను ప్రచారానికి వచ్చింది వైకాపాకు ఎందుకు ఓటేయకూడదో చెప్పడానికే. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మీ కుటుంబ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి. ఆ పార్టీని ఓడించాలని ఒక్కొక్కరు పది మందికి చెప్పండి. ఆ పది మంది వంద మందికి చెబుతారు. అప్పుడే ఆకాశంలో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి నేల మీదకు వస్తారు. మిగిలిన మూడేళ్లయినా ప్రజల కష్టాలు పట్టించుకుంటారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపాను ఓడించి.. జగన్‌కు గుణపాఠం చెప్పండి’ - చంద్రబాబు
నిత్యావసరాల ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని, జగన్ విద్యుత్తు ఛార్జీలు, ఆర్టీసీ, ఆస్తి పన్నులను పెంచారని చంద్రబాబు ఆరోపించారు.