Krishnapatnam Corridor: చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం వాటా కింద రూ.533.86 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ తెలిపారు. రాజంపేట ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కృష్ణపట్నం కారిడార్ కు సంబంధించి 12,798 ఎకరాలకు సమగ్ర బృహత్తర ప్రణాళిక, ప్రాథమిక ఆకృతి ఇప్పటికే పూర్తయ్యాయని, అందులో 2,500 ఎకరాలను మొదటి దశకు గుర్తించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన 2,139 ఎకరాలకు పర్యావరణ అనుమతులు పొందినట్లు వెల్లడించారు.
పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపిక చేసిన 474 పాఠశాలలకుగాను 372 బడుల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిధులు సమకూర్చినట్లు కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
38,901 గ్రామాలకు అందని మొబైల్ సేవలు:దేశవ్యాప్తంగా 2022, మార్చి నాటికి 38,901 గ్రామాలకు మొబైల్ సేవలు అందడం లేదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్ తెలిపారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 2,971 గ్రామాలకు మొబైల్ సేవలు అందడం లేదని మంత్రి పేర్కొన్నారు.