YCP leaders Attacks: ఎస్సీ మహిళపై దాడి.. వైసీపీ నాయకులపై కేసు నమోదు - YCP leaders attack SCs
14:34 July 23
ఆదూరుపల్లిలో ఎస్సీ మహిళపై దాడి చేసిన వైసీపీ నాయకులపై కేసు
Case against YCP leaders: నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలంలో ఎస్సీ మహిళపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదూరుపల్లి గ్రామంలో ఇటీవల ఎస్సీ మహిళ అయిన సంతోషమ్మ ఇల్లు వైసీపీ నాయకులు కూల్చివేసీ.. పెంచలయ్య, కోటయ్య, శీనయ్య అనే వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనపై న్యాయం కోసం 3 రోజుల క్రితం పోలీస్టేషన్ ఎదుట సంతోషమ్మ ఆందోళన చేపట్టింది. ఆమెకు అండగా ఎస్సీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. సంతోషమ్మ, ఎస్సీ నేతల ఆందోళనతో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏం జరిగిందంటే.. ఆదూరుపల్లి గ్రామంలో సంతోషమ్మ 2005 నుండి జీవనం సాగిస్తుంది. ఈమెకు ఉండటానికి 2010లో రెవెన్యూ అధికారులు 3 సెంట్ల స్థలం కేటాయించారు. పట్టా కూడా ఇచ్చారు. ఆ స్థలంలో సంతోషమ్మ రేకుల షెడ్డు వేసుకొని జీవనం సాగిస్తుంది. ఆ స్థలం రహదారికి దగ్గరగా ఉండడంతో దానిపై వైసీపీ నాయకుల కన్నుపడింది.. మండల జడ్పీటీసీ పీర్ల పార్థసారథి తమ్ముడు పెంచలయ్యకు.. మహిళ భర్త ఇటీవల చనిపోవడంతో కొన్ని రోజుల పాటు తల్లి దగ్గర ఉండడానికి వెళ్లింది. అదే అదునుగా భావించిన స్థానిక వైసీపీ నాయకుడు పెంచలయ్య రాత్రికి రాత్రి జేసీబీతో ఆ మహిళ ఉంటున్న ఇంటిని కూల్చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు సంతోషమ్మ వచ్చి ప్రశ్నించగా ఆమెపై దాడికి తెగబడ్డాడు. ఈ విషయాన్ని రెవిన్యూ, పోలీసుల ఆధిరారుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు పట్టించుకోవడం లేదంటూ సంతోషమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. వారి నుంచి ఎప్పటికైనా నాకు ఇబ్బంది చేకూరుతుందని న్యాయం చేయాలంటూ.. దళిత సంఘ నాయకులను ఆశ్రయించింది. మహిళతో సహా చేజర్ల పోలీస్ స్టేషన్కు చేరుకున్న దళిత సంఘ నాయకులు బాధితురాలుకి న్యాయం చేయాలంటూ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. మహిళపై దాడికి తెగబడిన వైసీపీ నాయకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.