ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ టిక్కెట్టు దక్కించుకోవడమే అతి పెద్ద సవాల్.. ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం మరో సవాల్.. ఇవన్నీ ఎలాగోలా సాధించి, జోరుగా ప్రచారం సాగిస్తున్న వేళ.. ఓటరు జాబితాలో పేరు లేకుంటే ఎలా ఉంటుంది? నెల్లూరు నగరపాలక సంస్థలో ఇప్పుడు కొందరు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
ఎన్నికల(nellore municipal elections)కు షెడ్యూల్ రాక ముందు నుంచే.. ఆయా పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తప్పకుండా పోటీలో ఉంటామనుకున్న కార్పొరేటర్ అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీ నేతల నుంచీ టిక్కెట్ హామీ పొందిన వారు ఇక నామినేషన్ దాఖలు చేయడమే మిగిలింది. కానీ.. నామినేషన్ల స్వీకరణకు కొన్ని గంటల ముందు విడుదల చేసిన ఓటర్ల జాబితా చూసుకున్న వారు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఓటర్ జాబితాలో తమ పేరు లేకపోవడంతో అయోమయానికి గురయ్యారు.
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరించనుండగా.. తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే.. మంగళవారం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో 10, 14 డివిజన్ల నుంచి పోటీలో ఉన్న కాకర్ల తిరుమలనాయుడు, ఉచ్చి భువనేశ్వరప్రసాద్ పేర్లు లేకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. పార్టీలో బలమైన యువనాయకులుగా ఉన్న వీరి పేర్లు తొలగింపుపై శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధికార పార్టీ నేతలు కావాలనే తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారంటూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించారు.